రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల.. ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-24 07:23:07  IST  )

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9న రెండు రోజుల పాటు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 (Rising Telangana Global Summit-2025)ను నిర్వహించబోతున్నారు.

రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల.. ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9న రెండు రోజుల పాటు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Global Summit-2025)ను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఇవాళ అధికారులు అందుకు సంబంధించిన లోగోను కూడా విడుదల చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025పై అధికారులతో అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.

కాగా, సమ్మిట్ తొలిరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి వివరించనున్నారు. రెండో రోజు తెలంగాణ భవిష్యత్తు దార్శనికత, ప్రణాళికలు పొందుపరిచిన తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటును ఆవిష్కరిస్తారు. ప్రభుత్వ విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలను వివరించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. వేడుకలకు హాజరయ్యే అతిథులకు వసతి సదుపాయాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు అటు పోలీసు శాఖ (Police Department), ఇటు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story