‘ఇంటర్’‌లో విప్లవాత్మక మార్పులు..! ‘ఏక్ స్టెప్ ఫౌండేషన్‌’తో AI క్లాసులు

by Kema Shiva Kumar |

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

‘ఇంటర్’‌లో విప్లవాత్మక మార్పులు..! ‘ఏక్ స్టెప్ ఫౌండేషన్‌’తో AI క్లాసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. నందన్ నిలేకని ఏక్ స్టెప్ ఫౌండేషన్‌తో ఏఐ క్లాసులు నిర్వహించేలా ఎంఓయూ చేసుకున్నట్టు, ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు ఫిజిక్స్ వాలా కోచింగ్ అందించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 494 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలోనే వీటికి ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇంటర్ బోర్డు కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఇంటర్ విద్య బలోపేతానికి సీఎం సూచనలు, ఇంటర్ బోర్డు అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు మిడ్డే మీల్స్, యూనిఫామ్స్ అందించేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోందన్నారు.

కమాండ్ కంట్రోల్ రూమ్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల్లో 5500 సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. నవంబర్ తర్వాత ఏఐ క్లాసులకు సంబంధించి స్క్రీన్లను కాలేజీలకు అందజేయనున్నట్టు చెప్పారు. విద్యార్థుల హాజరుశాతం పెంపునకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ని మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. విద్యార్థులు గైర్హాజరైతే వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపిస్తామని, విద్యార్థులు ఎందుకు రాలేదో ప్రిన్సిపాళ్లు తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుంటారన్నారు. దసరా తర్వాత ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు వివరించారు. ఈ నెల 26వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్‌లను నిర్వహిస్తామన్నారు. ఒక కాలేజీలో ఇంటర్ చదివి మంచి స్థానానికి ఎదిగిన విద్యార్థితో జూనియర్ విద్యార్థులకు ఇంటరాక్షన్ సెషన్‌లను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి చెప్పారు.

ప్రతి జిల్లాకు సోషల్ మీడియా సెల్

ఇంటర్ బోర్డుకు సంబంధించిన సమాచారాన్ని, విద్యార్థులకు అవసరమైన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రతి జిల్లాలో ఒక సోషల్ మీడియా సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి చెప్పారు. అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఇంటర్ ప్రాక్టికల్ నిర్వహించాలని, ప్రయివేటు కాలేజీలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ఉండదని స్పష్టం చేశారు.

Next Story