- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై రివ్యూ.. మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయాలు
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణకు కృష్ణా నదిపై ఉన్న హక్కులను పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం జలసౌధలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి దక్షిణ తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు రూ.200 కోట్లు, కోయిల్ సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాస పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జూన్ 2 నాటికి రూ.5,000 కోట్లు విడుదల చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు..
గత ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రూ.35,200 కోట్ల పరిపాలన అనుమతి ఉన్న ఈ ప్రాజెక్టులో సుమారు రూ.27వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా సమర్థంగా నీరు అందించలేదని అన్నారు. 2023 సెప్టెంబర్‌లో ఒక పంపును కేవలం గంటసేపు మాత్రమే నడిపి ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రచారం చేశారని విమర్శించారు. ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.55 వేల కోట్లుగా ఉండగా, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ నిర్మాణ వ్యయం కలిపితే మొత్తం ఖర్చు రూ.80 వేల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఆఫ్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల లిఫ్ట్ ఖర్చులు పెరిగి రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై రూ.7,161 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు.
జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలి..
జూరాల ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిందని మంత్రి తెలిపారు. 11.94 టీఎంసీల ఫుల్ కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం లైవ్ కెపాసిటీ సుమారు 9 టీఎంసీలకు తగ్గిందని పేర్కొన్నారు. దీంతో వెంటనే డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టు నుంచి తవ్వి తీసే ఇసుకను ఇతర ప్రాజెక్టుల పనులకు వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ
రాష్ట్రంలో వ్యవసాయరంగం గణనీయంగా పురోగమించిందని, గత ఖరీఫ్ సీజన్‌లో 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదైందని తెలిపారు. కనీస మద్దతు ధరపై సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20 వేల కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్ నాథ్, ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్‌తో పాటు నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.






