తుమ్మిడిహెట్టిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ : 150 మీటర్ల ఎత్తు.. 100 టీఎంసీలు లక్ష్యం!

by Ramesh Naini |

తుమ్మిడిహెట్టిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యంతో ఉన్నది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌ రెడ్డి సాగు నీటి ప్రాజెక్టులపై బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

తుమ్మిడిహెట్టిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ : 150 మీటర్ల ఎత్తు.. 100 టీఎంసీలు లక్ష్యం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తుమ్మిడిహెట్టిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యంతో ఉన్నది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌ రెడ్డి సాగు నీటి ప్రాజెక్టులపై బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంసీహెచ్ఆర్డీలో నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇంజినీర్లు, నిపుణులతో కలిసి సీఎం సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ను ఏ ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకోవచ్చన్న అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉండి, తెలంగాణ ప్రయోజనాలు సమగ్రంగా నెరవేరుతాయని నిపుణులు వివరించారు. ఇప్పటికే నిర్మించిన కాల్వలు, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన ఎత్తు అని సూచించారు. సీఎం స్పందిస్తూ.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణం వేగవంతం చేస్తూనే 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తక్షణమే చర్చలు జరిపి అనుమతులు సాధించాలని అన్నారు. ఇందుకు కేంద్ర సహకారం కోసం మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయాలని ఆదేశించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద ఇప్పటికే చేసిన భారీ వ్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 100 టీఎంసీల నీటి వినియోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు.

రూ.11 వేల కోట్ల ఖర్చు..

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే 71.5 కిలోమీటర్ల కాలువల నిర్మాణం పూర్తయిందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గత చర్చల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని.. 152 మీటర్లకు మించి నిర్మిస్తే ఆ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉంటుందని నిపుణులు వివరించారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తు మధ్యమార్గంగా సరైనదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు ప్రభావం ఉంటే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో కేంద్ర సహకారం కోరాలని సూచించారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్ సూచించారు.

తెలంగాణ మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు

అపాయింట్‌మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా కలిసి ప్రాజెక్ట్ అవసరాన్ని వివరించే బాధ్యతను మంత్రికే అప్పగించారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాతోపాటు తెలంగాణ మెట్ట ప్రాంతాల రైతులకు సాగునీరు, తాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో గ్రావిటీ ఆధారంగా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై సీఎం సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జియో టెస్టింగ్ పనులను వానాకాలం సీజన్‌కు ముందే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Next Story