TG: గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు

by Gantepaka Srikanth |

గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు

TG: గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3 వేల డ్రోన్లతో ఆకాశంలో ‘Telangana is Rising.. Come, Join the Rise’ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అబుదాబీ పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,131 డ్రోన్లతో Happy NewYear అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డును అందుకుంది. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్​సమ్మిట్ ముగింపు వేడుకల్లో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనుంది. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డు అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

కాగా, వికసిత్ భారత్-2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఈ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ను నిర్వహిస్తున్నారు.

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలుస్తుంది.

Next Story