హోంగార్డులను అవమానిస్తున్న రేవంత్ సర్కార్.. మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం

by Kema Shiva Kumar |

ఎన్నికల ముందు హోంగార్డులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చకపోగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికృత చేష్టలతో వారిని తీవ్రంగా అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోంగార్డులను అవమానిస్తున్న రేవంత్ సర్కార్.. మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు హోంగార్డులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చకపోగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికృత చేష్టలతో వారిని తీవ్రంగా అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల మంది హోంగార్డులకు ఆయన ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి సేవలను గుర్తించి చేపట్టిన చర్యలను గుర్తు చేశారు. జనవరి 2025లో వెలువడిన జీవో నెం.2 ప్రకారం సహజ మరణం పొందిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారని.. కానీ, 10 నెలలు గడుస్తున్నా ఒక్కరికీ డబ్బు అందలేదన్నారు.

అదేవిధంగా హెల్త్ కార్డులు (Health Cards) ఇస్తామని హామీ ఇచ్చారని.. సకాలంలో చికిత్స అందక అనేక మంది మరణిస్తున్నారని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ తప్ప మిగతా జిల్లాల హోంగార్డులకు 4 ఏళ్ల పెండింగ్ యూనిఫాం అలవెన్స్ ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంగార్డు రవీందర్ కుటుంబానికి అండగా నిలుస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాలు ఇస్తామని చెప్పిన రేవంత్ ఆ హామీని విస్మరించారని పేర్కొన్నారు. అభయ హస్తం మేనిఫెస్టోలో హోంగార్డుల అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని ఆరోపించారు. జీతాలు సకాలంలో రాకపోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కూడా కట్టలేని దయనీయ స్థితిలో హోంగార్డులు ఉన్నారని పేర్కొన్నారు.

గడిచిన రెండేళ్లలో 60 మంది పైగా హోంగార్డులు చనిపోయారని.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి తప్ప మిగతా సహజ మరణాలకు ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆర్డర్లీ వ్యవస్థ రద్దు, ఇతర భత్యాలు అంటూ రేవంత్ హామీలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. హోంగార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని హరీశ్‌ రావు డిమాండ్ చేశారు.

Next Story