local body elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్కెచ్.. కేసీఆర్ 'రాజకీయ అజ్ఞాతవాసం' వీడేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-09-29 10:05:50  IST  )

local body elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్కెచ్.. కేసీఆర్ రాజకీయ అజ్ఞాతవాసం వీడేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం రానే వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చెప్పినట్లుగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు సిద్ధమయ్యామని కాంగ్రెస్ ఓటర్ల వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే.. ఇప్పటి వరకు ఓ లెక్క ఈ ఎన్నికలు మరో లెక్క అని బీఆర్ఎస్ చాలెంజ్ చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలకు కారు పార్టీ సై అంటోంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఈసారి ప్రజలు మా వైపే చూస్తున్నారని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్:

తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ లోకల్ బాడీ ఎన్నికలు చాలెంజ్ గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ చాలెంజ్‍గా నిలవనున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న ఆ పార్టీ.. లోకల్‍లో సత్తా చాటడం ద్వారా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాష్ట్ర రాజకీయాల్లో రౌండప్ చేసేందుకు ఈ ఎన్నికలే కీలకం అని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చకచక పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్.. తాజాగా గ్రూప్-1 నియామకాలు, గ్రూప్-2 ఫలితాలు వెల్లడించాకే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రావడం వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఓ వైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ నోటిఫికేషన్‍కు మొగ్గుచూపడం వెనుక బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టే వ్యూహం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము చేయగలిగినదంతా చేశామని చివరకు జీవో ద్వారా అమలు చేయబోతే కోర్టులకు వెళ్లారని ఈ అంశాన్ని తమకు సానుకూలంగా మార్చుకునే అవకాశం హస్తం పార్టీ వైపు నుంచి కనిపిస్తోంది. ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకున్న కాంగ్రెస్ పక్కా వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగిందనే చర్చ జరుగుతోంది.

కేసీఆర్ రాజకీయ అజ్ఞాతవాసం వీడేనా?:

స్థానిక ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇంకా ఎర్రవల్లి ఫామ్ హౌస్‍కే పరిమితం అయ్యారనే టాక్ ఉంది. ఐదు నెలల క్రితం వరంగల్ ఎల్కతుర్తి సభలో ప్రజలకు కనిపించిన ఆయన ఆ తర్వాత ప్రజాక్షేత్రానికి దూరంగా రాజకీయ అజ్ఞాతవాసం పాటిస్తున్నారు. ఏది ఉన్నా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పార్టీ నేతలను పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పార్టీని కుదిపేసిన కవిత ఎపిసోడ్ వంటి అంతర్గత ఇబ్బందులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ప్రజలను నేరుగా అడ్రస్ చేయలేకపోయారు. కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలిస్తేనే రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవానికి చాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికైనా రాజకీయ అజ్ఞాతవాసం వీడుతారా లేక కేటీఆర్, హరీశ్ రావు పైనే ఈ ఎన్నికల భారం మోపుతారా అనేది వేచి చూడాలి.

కమలనాధులు ఒక్కతాటిపైకి వచ్చేనా?
గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీలోని పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నేతల మధ్య అంతర్గత పోరు చల్లారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ పదవి విషయంలో మొదలైన ఈ ఆధిపత్య పోరు ప్రస్తుతం అంతా సద్దుమణిగినట్లు పైకి కనిపిస్తున్నా లోలోపల మాత్రం నేతల మధ్య గ్రూప్ పాలిటిక్స్ అలాగే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని నడిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఈ స్థానిక ఎన్నికలు పెద్ద సవాలుగా మారనున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య ఎత్తుకు పై ఎత్తుల ఎలా ఉండబోతున్నాయి? ఇంతిమంగా ప్రజానిర్ణయం ఏం డిసైడ్ చేయబోతోంది అనేది స్టేట్ పాలిటిక్స్ లో సస్పెన్స్ గా మారింది.

Next Story