- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ భాష స్థాయికి తగ్గట్లు లేదు’.. కేరళ సీఎంకు రేవంత్ రెడ్డి కౌంటర్
కేరళ సీఎం పినరయి విజయన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయన్ రాసిన లేఖకు సమాధానంగా, రేవంత్ రెడ్డి ఒక ఘాటైన లేఖను విడుదల చేశారు. భాషా సంస్కారాన్ని విస్మరించి విజయన్ ప్రయోగించిన పదజాలంపై రేవంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మీరు వాడిన పదజాలం చాలా దిగజారుడుతనంతో ఉంది. కానీ నేను మాత్రం మీలాంటి అనాగరికమైన పదాలను వాడను. మీరు నా రాష్ట్రాన్ని సందర్శిస్తే, ఒక అతిథికి ఇవ్వాల్సిన మర్యాదలను తప్పకుండా పాటిస్తా" అని రేవంత్ స్పష్టం చేశారు. కేరళ అభివృద్ధి అంతా దశాబ్దాల క్రితం జరిగిన కృషి ఫలితమేనని, మీ ప్రభుత్వ పనితీరు ఏమిటో ప్రజలకు చూపాలని రేవంత్ సవాల్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి 28 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ తక్కువ కాలంలోనే రాష్ట్ర జీ.ఎస్.డీ.పీ (GSDP) 10.1% వృద్ధిని సాధించిందని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ, కేరళను కూడా అధిగమించి అగ్రస్థానంలో ఉందని ఆర్.బీ.ఐ నివేదికలను ఉటంకించారు.
పేదరిక నిర్మూలనపై ప్రశ్నలు..
నవంబర్ 1, 2025 నాటికి కేరళలో పేదరికం పూర్తిగా తొలగిపోయిందని మీరు ప్రకటించారు, కానీ ఇప్పటికీ 64,006 కుటుంబాలకు మైక్రో-ప్లాన్లు ఎందుకు అమలు చేస్తున్నారు? ఆ ప్రకటనను ఎవరైనా స్వతంత్రంగా ధృవీకరించారా? అని రేవంత్ నిలదీశారు. కేరళలో అవినీతి లేదని చెబుతున్న మీరు.. మీ ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఉన్న "గోల్డ్ స్మగ్లింగ్" కేసు ఎందుకు ఇంకా తేలలేదు? అని ప్రశ్నించారు. అలాగే, శబరిమల ఆలయంలో మాయమైన 4.5 కిలోల బంగారం సంగతి ఏమిటని నిలదీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాబోయే పదేళ్లలో హైదరాబాద్ సమీపంలోని 'ఫ్యూచర్ సిటీ', జహీరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని రేవంత్ తన లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కేరళ ప్రజలు త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ విబేధాలు ఉన్నప్పటికీ, ఒక ముఖ్యమంత్రికి మరొక ముఖ్యమంత్రి ఇటువంటి ఘాటైన లేఖలు రాయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయన్ లేఖకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ సమాధానం, కేరళలో కాంగ్రెస్ - లెఫ్ట్ పార్టీల మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది.






