KTR : రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరోసారి కులగణన(Cast Census) చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

KTR : రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరోసారి కులగణన(Cast Census) చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రేవంత్ సర్కార్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండోసారి అయినా సర్వేను సమగ్రంగా చేయడంతోపాటు బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) నిర్వహించాలని పేర్కొన్నారు.

అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్‌తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినా వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలని సూచించారు. తూతూమంత్రంగా తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే బీఆర్ఎస్‌తోపాటు బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు.

Next Story