ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ ఊరట.. ఫీజుల విషయంలో సీఎం కీలక నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2026-02-26 13:24:15  IST  )

అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తల్లిందడ్రులకు భారీ ఉరట లభించనుంది.

ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ ఊరట.. ఫీజుల విషయంలో సీఎం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలు అతిక్రమించి ఫీజులు వసూలు చేస్తే ఆ పాఠశాల అనుమతి రద్దుతో పాటు ఆ ఫీజు రికవరీ చేసేలా నిబంధన విధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల (Private School Fee) నియంత్రణకు సంబంధించి రికమండేషన్స్‌ను ప్రజాభిప్రాయం కోసం వెబ్‍సైట్‍లో ఉంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇవాళ విద్యాశాఖపై (Telangana Education Department) ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్‍లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని సూచించారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్స్‌లో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలన్నారు.

విద్యార్థుల ట్రాన్స్‌పోర్టు కోసం ఎలక్ట్రిక్ బస్సులు..

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‍ను పకడ్బందీగా అమలు చేయాలని, తప్పని సరిగా పాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం విజయ డైరీ నుంచి పాలు సేకరించాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా రూపుదిద్దుకుంటున్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల తరహాలో ట్రాన్స్‌పోర్టుతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్‌పోర్టు కోసం ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఏయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story