MANUU: రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూనివర్సిటీ భూములను టార్గెట్ చేస్తోంది: హరీశ్ రావు

by Prasad Jukanti |

యూనివర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

MANUU: రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూనివర్సిటీ భూములను టార్గెట్ చేస్తోంది: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్లలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వవిద్యాలయాల భూమును పదే పదే టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. ఈ చర్యల వల్ల విద్య, పరిశోధనల పట్ల ప్రభుత్వ ఆలోచనపై సందేహాలు వ్యక్తం అవుతున్నయన్నారు. ఈవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన హరీశ్ రావు.. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయాల నుంచి 100 ఎకరాలకు పైగా భూమిని బలవంతంగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఈ ప్రక్రియలో 60 ఏళ్లుగా విలువైన జన్యువనరులు (germplasm), పరిశోధనలతో ఉన్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రానికి చెందిన 60 ఎకరాలు పూర్తిగా నాశనం అయ్యాయని ఆరోపిచారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)కి చెందిన 400 ఎకరాలపై ప్రభుత్వం కన్నేసిందని ఈ క్రమంలో అటవీ భూమి దెబ్బతినడంతో పాటు జీవవైవిధ్యానికి అంతరించిపోతున్న వన్యప్రాణులకు ముప్పు ఏర్పడిందన్నారు.

తాజాగా ఇప్పుడు ప్రభుత్వం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)కి చెందిన 50 ఎకరాల భూమిపై కన్నేసిందని ఇవన్నీ వేర్వేరు ఘటనలు కావని విద్యాసంస్థలపై జరుగుతున్న వ్యవస్థ బద్ధమైన దాడికి ఇవి నిదర్శనాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు, విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా ఉందా? విద్య, ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన భూమిని ఎందుకు వ్యర్థమని భావిస్తున్నారని నిలదీశారు. యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వ చర్యలు సిగ్గుచేటని తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సిన ప్రభుత్వం జ్ఞానాన్ని నిర్మించకుండా, దాన్ని బుల్డోజర్లతో కూల్చడంలోనే ఆసక్తి చూపుతోందని దుయ్యబట్టారు.

Next Story