రేవంత్ నా మాటలను జాగ్రత్తగా విను.. ప్రధాని మోడీ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-10 11:02:28  IST  )

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ‘నా మాట జాగ్రత్తగా విను’ అంటూ నిధుల లెక్కలు చెప్పారు.

రేవంత్ నా మాటలను జాగ్రత్తగా విను.. ప్రధాని మోడీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఆదివారం నగరంలోని హెచ్‌ఐసీసీలో ఆయన రూ. 9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్‌లోని పీఎం మిత్ర (PM MITRA) పార్కును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి నాలుగు వరుసల రోడ్డు పనులకు, గెడెబెల్లూరు - మహబూబ్‌నగర్ మధ్య 165 కిలోమీటర్ల మేర హైవే పనులకు శంకుస్థాపన చేశారు. దండు మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందని, అంతర్జాతీయ స్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు ఉందని కొనియాడారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

రేవంత్.. జాగ్రత్తగా విను..

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు కనెక్టివిటీని భారీగా పెంచామని చెబుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను జాగ్రత్తగా వినాలన్నారు. "కేవలం రోడ్ల నిర్మాణానికే రూ. 2 లక్షల కోట్లు కేటాయించాం. దీనివల్ల తెలంగాణకు ఎంతో లాభం చేకూరింది. ఉమ్మడి ఏపీలో రైల్వేకు కేవలం రూ. వెయ్యి కోట్లు ఇస్తే, మేము తెలంగాణకు రూ. 5,500 కోట్లు కేటాయించాం. రాష్ట్రానికి 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇచ్చాం. కాజీపేట జంక్షన్‌ను వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం" అని గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి..

ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభ ప్రభావం మన దేశంపై పడకుండా చూసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి తాను రాజకీయాలు మాట్లాడబోనని అంటున్నారని, తాను కూడా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదని మోదీ వ్యాఖ్యానించారు. "గత పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చాం. ఒకవేళ వివక్ష చూపి ఉంటే.. ఇప్పుడు ఇచ్చే నిధుల్లో సగం కూడా వచ్చేవి కావు. అవి మీకు సరిపోతాయా?", ఓ పని చేయ్.. నాతో కలిసి చూడు, నువ్వు వెళ్లాలని అనుకుంటున్న పోజీషన్‌కు తీసుకెళ్తానని ప్రధాని నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇస్తూ సెటైర్లు వేశారు.

Next Story