గ్లోబల్ సమ్మిట్‌తో పెరిగిన రేవంత్ గ్రాఫ్.. పాలనపై పట్టు సాధిస్తున్న సీఎం

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్​రెడ్డి గ్రాఫ్​పెరుగుతున్నది.

గ్లోబల్ సమ్మిట్‌తో పెరిగిన రేవంత్ గ్రాఫ్.. పాలనపై పట్టు సాధిస్తున్న సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్​రెడ్డి గ్రాఫ్​పెరుగుతున్నది. గత రెండు నెలల్లో వరుస వరుస పరిణామాలు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్​ఉప ఎన్నిక ఫలితం, ఆ తర్వాత గ్లోబల్​రైజింగ్​సమ్మిట్, ఫుట్​బాల్​దిగ్గజంతో మ్యాచ్​విజయవంతం కావడం వంటి ఘట్టాలతో ఆయనకు సరికొత్త అభిమానులు ఏర్పడ్డారు. గత రెండు నెలల్లో జరిగిన కార్యక్రమాలు, పరిణామాలు రేవంత్​రెడ్డిని మరికొన్ని వర్గాలకు చేరువ చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు వచ్చేలా కొన్ని రోజులుగా కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు. ఓవైపు అధికార యంత్రాంగం పరంగా, మరోవైపు పార్టీలోనూ ఆయనకు పట్టుపెరిగింది. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ, సీఎం రేవంత్​రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలిపోయింది. నెల రోజుల్లోనే రాహుల్​గాంధీని రేవంత్​రెడ్డి రెండు సార్లు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడే ఫుట్​బాల్​మ్యాచ్​చూడటానికి ఢిల్లీ నుంచి రాహుల్​గాంధీ వచ్చారని అభిమానులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత పట్టు సాధించి అధికార యంత్రాంగం, పార్టీని మరింత పరుగులు పెట్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జూబ్లీహిల్స్ గెలుపుతో..

ఇటీవల ముగిసిన జూబ్లీహిల్స్​ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. సీఎం రేవంత్​రెడ్డి అన్నీతానై నడిపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేశారు. అభ్యర్థి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్​గెలుపు ఈజీ అయింది. గెలుపు తమదేనని అతివిశ్వాసంతో వ్యవహరించిన గులాబీ నేతలకు ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసింది. నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో భారీ మెజార్టీ అందించడంతో రేవంత్​రెడ్డికి అన్నివర్గాల నుంచి పొగడ్తలు వచ్చాయి. దీంతో ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలోనూ ఆయనకు ఎదురులేకుండా పోయింది.

గ్లోబల్​ సమ్మిట్ సక్సెస్

కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖులను ఆహ్వానించి నిర్వహించిన గ్లోబల్​రైజింగ్​సమ్మిట్​విజయవంతమైంది. సుమారు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపచంలోని అగ్రగ్రామి కంపెనీలు, సంస్థలు, దేశీయ సంస్థలు ముందుకొచ్చాయి. తమకు పెట్టుబడులపై ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న అపోహలు, అనుమానాలు ఈ సమ్మిట్​ద్వారా తీరాయని పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ, రియల్​ఎస్టేట్​రంగ ప్రముఖులు చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ పారిశ్రామిక, రియల్​ఎస్టేట్​కార్యకలాపాలు పుంజుకుంటాయని దీమా వ్యక్తం చేస్తున్నారు.

హైప్ పెంచిన మెస్సీ మ్యాచ్

కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన సంబరాల్లో భాగంగా అంతర్జాతీయ ఫుట్​బాల్​దిగ్గజం లియోనిల్​మెస్సీ టూర్​హైదరాబాద్​లో ఉండేలా ఏర్పాటు చేయించడంలో సీఎం రేవంత్​రెడ్డి సక్సెస్​అయ్యారు. స్వయంగా ఫుట్​బాల్​క్రీడాకారుడైన రేవంత్​రెడ్డి మెస్సీతో గేమ్​ఆడటానికి ముందు వామప్​మ్యాచ్​ల్లో పాల్గొన్నారు. ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో గేమ్​ఆడతారని సమాచారం రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఉప్పల్​స్టేడియం వద్ద టికెట్ల కోసం ఎగబడ్డారు. మ్యాచ్​ను స్వయంగా చూడటానికి కాంగ్రెస్​అగ్రనేత, విపక్ష నేత రాహుల్​గాంధీ ఢిల్లీ నుంచి రావడంతో కాంగ్రెస్​పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. అంతర్జాతీయ ఫుట్​బాల్​క్రీడాకారుడిని హైదరాబాద్​కు రప్పించడం, ఆయనతో గేమ్​ ఆడటంతో రేవంత్​రెడ్డి పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగాయి. ఇంత మంచి జరిగినా ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా సక్సెస్​కాలేకపోతున్నదని పార్టీలోని కొందరు ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Next Story