- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు భరోసాలో 'రేవంత్' మార్క్: ఇక విడతలు లేవు.. ఒకేసారి అందరికీ నగదు జమ!
రైతు భరోసాను ఈ సారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు భరోసాను ఈ సారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది. గతంలో ఎకరం భూమి ఉన్న రైతులతో మొదలుపెట్టి.. విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసేవారు. దీంతో ఏడెనిమిది విడతల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేది. దీని వల్ల సాయం అందడంలో చాలా మందికి ఆలస్యమయ్యేది. అంతేకాకుండా ఈ సీజన్ లో ఇప్పటి వరకు రైతుభరోసా ఇవ్వకపోవడంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీయడంతోపాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. వీటన్నింటినీ అధిగమించేలా ఈ సారి సరికొత్త విధానంలో రైతుభరోసా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి తొలి ఎకరానికి సంబంధించి రూ. 6వేల పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ వద్ద రైతుల జాబితా సిద్ధంగా ఉండగా.. మొదటి విడత కింద సుమారు 70 లక్షల మంది రైతులకు రూ. 3,590 కోట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి నర్మెట్టలో ఈ పథకాన్ని ప్రారంభించగానే రైతుల ఫోన్లకు ఎకరం డబ్బులు పడినట్లు మెసేజులు వచ్చే అవకాశముంది. ఈ విధానం రైతులను మెప్పించవచ్చని వ్యవసాయశాఖ భావిస్తున్నది.
మూడు విడతల్లో పంపిణీ
రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మొత్తం మూడు విడతల్లో పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. తొలి విడత పంపిణీ పూర్తయిన తర్వాత 20 రోజులకు రెండో విడత కింద రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరుకు మూడో విడత నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులు 62.48 లక్షల మంది ఉన్నారు. వీరికి సాయం అందితే దాదాపు 90 శాతం పంపిణీ పూర్తయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో విపక్షాల నుంచి విమర్శలకు తావుండదని అంచనా వేస్తున్నది. కాగా, మూడు విడతల్లో కలిపి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
కొత్త విధానం ఇలా..
మొదటి విడతలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న ప్రతి రైతుకూ నిధులు జమచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంట్లో ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతుకూ లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు సైతం మొదటి విడతలో ఒక ఎకరానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి. మిగతా 4 ఎకరాల భూమికి తర్వాత విడతల్లో ప్రభుత్వం జమచేస్తుంది.
కొత్త దరఖాస్తులకు చాన్స్
ఇంత వరకు పెట్టుబడి సాయం పొందని రైతులు, ఫిబ్రవరి 28లోగా కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు పొందిన వారికి రైతు భరోసా కోసం ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హులైన రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతోపాటు తమ ఆధార్ కార్డ్, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లతో స్థానిక రైతు వేదికల వద్ద కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపింది.
అర్హతలు ఇలా..
రైతుభరోసా ప్రయోజనం పొందాలంటే రైతులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. కనీస వయస్సు పద్దెనిమిదేళ్లు, సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి ఉండి, ధరణి పోర్టల్ లో నమోదై ఉండాలి. సాగుకు యోగ్యం కాని (బీడు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు) రైతు భరోసా పథకానికి అనర్హులు. ఇలాంటి భూములకు దరఖాస్తు చేసుకున్నా.. పెట్టుబడి సాయం అందదు. తప్పుడు పత్రాలతో, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడి సాయం అందకపోగా.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.






