మహిళలకు రేవంత్ సర్కార్ కానుకలు.. మే 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు..

by Prasad Jukanti |   (  Updated:2026-05-21 06:27:26  IST  )

తెలంగాణలో మే 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహిళలకు రేవంత్ సర్కార్ కానుకలు.. మే 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో / డైనమిక్ బ్యూరో: మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులతో స‌హా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.

సీఎం చేతుల మీదుగా ప్రారంభం:

ప్రత్యేకంగా మే 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది. మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీత‌క్క ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

రోజు వారీ కార్యక్రమాలు

మే 25 – సౌర విద్యుత్ ప్లాంట్లు & ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు

=వికారాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కె.అసిఫాబాద్ ప్రాంతాల్లో 0.5 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం

=మ‌హిళా సంఘాల‌చే న‌డిచే 450 RTC బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం

=జిల్లా స్థాయిలో పోషకాహార అవగాహన కార్యక్రమాలు

=SHGలు, గ్రామ సంఘాల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు

=మహిళా సంఘాలకు బ్యాకింగ్ లోన్లు, వ‌డ్డి లేని రుణాలు విడుదల, ఉత్తమ సంఘాల సత్కారం

=2026-27 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

మే 26 – సామాజిక సమీకరణ దినం

=అర్హులైన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, బాలికల గుర్తింపు

=మిగిలిన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చడం

=దివ్యాంగులు, వృద్ధ మహిళల SHGల ఏర్పాటు

=టీన్ ఏజ్ బాలిక‌లతో మాక్ పార్లమెంట్ నిర్వహణ

మే 28 – మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలు

=మహిళా సంఘ భవనాలు, వర్క్ షెడ్లు, మ‌హిళా గోదాముల నిర్మాణాలకు శంకుస్థాపనలు

=భూమి పూజలు, ప‌నుల ప్రారంభోత్స‌వాలు

మే 29 – రుణమేళాలు & జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్

=హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం

=మండల స్థాయిలో రుణమేళాలు

=మండల సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు

=కోళ్ల పెంపకం యూనిట్లు-500, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు

=బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం

=కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ మద్దతు

=ఆయిల్ బండ్లు, నెక్ ఎగ్ కార్ట్స్ పంపిణీ

=దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ

=వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు, షేడ్ నెట్లు, 185 గోదాముల నిర్మాణాలకు భూమి పూజ

=తేనెటీగల పెంపకం యూనిట్లు, బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల గ్రౌండింగ్

మే 30,31 – మహిళల భద్రత మరియు మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు

=జిల్లా మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం

=గుర్తించిన ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల భూమిపూజలు

=జిల్లా సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు

=టీన్ ఏజ్ బాలిక‌ల‌కు సైకిళ్ల పంపిణీ

అమ్మకు అక్షర‌మాల కార్యక్రమంలో భాగంగా చ‌దువు నేర్చుకున్న మ‌హిళ‌ల‌కు స‌త్కారం

=ఆరోగ్య శిబిరాలు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు

=మహిళల భద్రత కోసం ప్రత్యేక వింగ్ కార్యక్రమాలు

=పట్టణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ చీరల పంపిణీ

ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే మహిళా వారోత్సవాలను అధికారులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదు: రేవంత్ రెడ్డి

Next Story