తగ్గిన అదనపు ఆదాయం.. అధికారులపై మంత్రుల కమిటీ సీరియస్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తున్నది.

తగ్గిన అదనపు ఆదాయం.. అధికారులపై మంత్రుల కమిటీ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా గతేడాది కన్నా ప్రస్తుతం 5 శాతం ఆదాయం వృద్ధి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుంటారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత ఏడాది జూన్, జులై, ఆగస్టు మాసాల్లో ఆశించిన ఆదాయం రాలేదు. ఈ విషయంపై మంగళవారం సెక్రెటేరియట్‌లో సమావేశమైన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఎందుకు ఇలా జరుగుతుందో గుర్తించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఆ రాష్ట్రాల్లో ఆదాయం పెరిగి ఇక్కడ ఎందుకు తగ్గింది?

రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ హాట్ హాట్‌గా జరిగినట్టు తెలుస్తున్నది. ఈ సమావేశానికి కర్ణాటక, జార్ఖండ్‌లో వచ్చిన స్టేట్ ఓన్ ఆదాయ వివరాలను అధికారులు తీసుకొచ్చారు. ఆ రెండు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖల్లో రెవెన్యూ పెరిగింది. కానీ ఇక్కడ ఎందుకు తగ్గింది? అని సంబంధిత శాఖ అధికారులను సబ్ కమిటీ మంత్రులు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ట్రైబల్ ప్రాంతాలు అధికంగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆదాయం పెరగడం ఏంటి? అర్బన్ ఏరియాలు అధికంగా ఉన్న మన రాష్ట్రంలో తగ్గడం ఏంటని సీరియస్ అయినట్టు టాక్. ఆదాయం గండిపడటానికి ప్రధాన కారణాలను గుర్తించి, వెంటనే రిపోర్టు ఇవ్వాలని వారిని మంత్రులు ఆదేశించినట్లు తెలిసింది.

వరదలతో లిక్కర్ ఆదాయానికి గండి?

సాధారణంగా మందు బాబులు రెగ్యులర్‌గా వినియోగించే మద్యం కన్నా వర్షాకాలంలో కాస్త ఎక్కువగా తీసుకుంటుంటారు. కానీ రాష్ట్రంలో మాత్రం వర్షాకాలంలో లిక్కర్ ఆదాయం పడిపోయింది. అందుకు ప్రధాన కారణం ‘వర్షాల వల్ల లిక్కర్ డిపోల చుట్టూ నీళ్లు నిలిచాయి. అందుకని మద్యం షాపులకు ట్రాన్స్ పోర్టు చేయలేకపోయాం’ అని ఎక్సైజ్ అధికారులు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తున్నది. వరదల వల్ల రెండు మూడు రోజుల పాటు లిక్కర్ ట్రాన్స్‌పోర్టు నిలిచిపోవచ్చు. కానీ వరుసగా జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎక్సైజ్ ఆదాయం క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. అలా ఎందుకు జరుగుతుంది? లోపం ఎక్కడ ఉంది? అనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story