అటకెక్కిన భూ సమస్యల పరిష్కారం.. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఫైళ్లు!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం అటకెక్కింది.

అటకెక్కిన భూ సమస్యల పరిష్కారం.. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఫైళ్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం అటకెక్కింది. రెవెన్యూ అధికారులు నెలల తరబడి ఫైళ్లు చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. తహశీల్దార్లు, ఆర్డీవోలను రిక్వెస్ట్ చేసి రిపోర్టులు రాయించుకున్నా.. అదనపు కలెక్టర్ల వద్ద ఫైళ్లు పెండింగులో పడిపోతున్నాయి. ముప్పుతిప్పలు పడి వారిని కలిసినా.. ఈ వారంలో చేసేస్తాం అంటూ తిప్పిపంపిస్తున్నారు. మరో రెండు, మూడు నెలల తర్వాత వెళ్లినా అదే సీన్ రిపీట్ అవుతున్నది. కొందరు అధికారులకు వారు ఆశించినది దక్కే వరకు తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణి, హైదరాబాద్ ప్రజా భవన్ లో నిర్వహించే ప్రజా దర్బార్ వంటి వేదికల్లో 80 శాతం వరకు భూ సమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భూ సమస్యలే ప్రధానాస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే పరిశీలించకుండా..

తహశీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు భూ సంబంధ అప్లికేషన్లను వెంటనే పరిశీలించడం లేదు. బాధితులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారు. కొందరు కలెక్టర్లయితే నాలుగు నెలల నుంచి ఒక్క ఫైల్ కూడా చూడకుండా కాలయాపన చేస్తున్నారు. భూ భారతి అవగాహన సదస్సులు, రెవెన్యూ సదస్సులు అంటూ కుంటిసాకులు చెప్తున్నారు. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ ఇలా మూడు దశలు దాటుకుంటూ అప్రూవ్ చేసిన ఫైళ్లను కూడా నెలల తరబడి చూడకుండా టేబుల్ మీద ఉంచుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది వరకు భూ సమస్యలపై దాఖలైన దరఖాస్తుల డ్యాష్ బోర్డుపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ప్రతి నెలా సమీక్షించేవారు. ఇప్పుడేమో అంతా బిజీగా ఉన్నారంటూ చెబుతున్నారు.

ఆర్నెళ్ల తర్వాత ఆర్డీవోకు బదిలీ ఎందుకు?

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఒక వ్యక్తి కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. అమ్మాయి పెళ్లి కోసం తన భూమిని అమ్మేందుకి సిద్ధమై పెండింగ్ మ్యుటేషన్ కింద అప్లయ్ చేశాడు. ఈసీలు, సీసీలు, సేల్ డీడ్స్.. ఇలా అన్నీ సమర్పించాడు. రెండేండ్లు గడుస్తున్నా పని కావడం లేదు. రికార్డులు పరిశీలించిన తహశీల్దార్ పాజిటివ్ గానే రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్డీవో కూడా రికమండ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ దగ్గర ఫైల్ పెండింగ్ పడింది. ఆర్నెళ్ల పాటు ప్రతి సోమవారం ప్రజాణిలో పిటిషన్ ఇచ్చి వేడుకున్నాడు. దరఖాస్తు చూడగానే వచ్చే వారం అయిపోతుందంటూ పంపిస్తున్నారు. ఇటీవల మరోసారి వెళ్తే.. తన ఫైల్ ను ఆర్డీవోకు పంపించినట్లు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే రిపోర్ట్ సమర్పించిన ఆర్డీవోకు మళ్లీ ఫైల్ తిప్పి పంపడం వెనుక ఉద్దేశ్యమేమిటో అర్థం కావడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఏదైనా డౌట్ ఉంటే రిపోర్ట్ అందిన గత డిసెంబరులోనే ఆర్డీవోకు తిప్పి పంపాలి. కానీ ఏడు నెలల పాటు అదనపు కలెక్టర్ టేబుల్ మీద ఎందుకు ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే తనపై కక్ష కట్టి పని చేయకుండా ఇంకా పెండింగులో పెడతారని భయంగా ఉందని ‘దిశ’కు చెప్పుకొని బాధ పడ్డాడు. భూమి అమ్మలేకపోవడం వల్ల అమ్మాయి పెళ్లిని వాయిదా వేస్తూనే ఉన్నట్లు తెలిపాడు. మరొకరి పట్టా భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. సమస్య పరిష్కరిస్తే తప్ప ఆ భూమిని అమ్మేందుకు వీల్లేదు. అది అమ్మితే తప్ప తన కొడుకును విదేశాలకు పంపలేనని ఆయన వాపోతున్నాడు. అక్టోబరు నుంచి ప్రతి సోమవారం ప్రజావాణికి వస్తూనే ఉన్నా అధికారులు మాత్రం కనికరించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అంతా ‘డీ’ సెక్షన్ తోనే..

రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరు పవర్ ఫుల్ అంటే.. డీ సెక్షన్ అని వినిపిస్తుంది. అలాగే కొందరు తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల దగ్గరుండే ఆపరేటర్లు కూడా మోస్ట్ పవర్ ఫుల్ గా మారారు. రిజిస్ట్రేషన్లలో డిజిటల్ సంతకం తీసుకోకుండా.. ఆధార్ ఓటీపీ ద్వారానే చేస్తాం అంటూ ఫైళ్లను పెండింగ్ పెడుతున్నారు. తహశీల్దార్ ను కూడా కాదని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక రెవెన్యూ రికార్డుల్లో డేటా కరెక్షన్, పీవోబీ నుంచి తొలగించాలని వచ్చే దరఖాస్తులపై కలెక్టరేట్లల్లో డీ సెక్షన్ సిబ్బంది ఆధిపత్యం కొనసాగుతున్నది. వాళ్లు ఎంత చెప్తే అంత నడుస్తుందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే అప్లయ్ చేసుకున్న వారం రోజుల్లోనే కొందరి సమస్య పరిష్కారమవుతున్నది. మరికొందరి దరఖాస్తులేమో మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ అవుతున్నాయి. లేదంటే నెలల తరబడి పెండింగులో ఉంటున్నాయి.

రికార్డులు పరిశీలించకుండా రిజెక్ట్!

ఇబ్రహింపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నం.41 పూర్తిగా పట్టా భూమి. 1954 నుంచి పహానీల్లో పట్టాగానే క్లాసిఫికేషన్ ఉంది. కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడీ సర్వే నంబర్లు 343 సబ్ డివిజన్లుగా మారాయి. లెక్క లేనన్ని సార్లు స్టాంప్ డ్యూటీ కట్టించుకొని సేల్ డీడ్స్ చేశారు. ఇప్పుడు ఖాస్రా పహానీ ప్రకారం అంటూ దాన్ని పీవోబీలో చేర్చారు. మరి 70 ఏండ్ల రెవెన్యూ రికార్డులకు విలువ లేదా? ఇన్నేండ్లుగా పట్టా అని రాయడం వల్లనే కదా తాము కొనుగోలు చేశామంటూ బాధితులు అంటున్నారు. అయితే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఎన్నిసార్లు అప్లయ్ చేసినా.. తహశీల్దార్ మొదలు సీసీఎల్ఏ వరకు పాత రికార్డులను పరిగణనలోకి తీసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారు. అయితే పాత రికార్డుల్లో క్లాసిఫికేషన్ పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించి న్యాయం చేయాల్సిన తహశీల్దార్, ఆర్డీవోలు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story