- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలకిందులైన రిజర్వేషన్లు.. ఓసీ నేతల్లో తీవ్ర నైరాశ్యం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. రిజర్వేషన్లపై స్పష్టత రాగా, ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాక.. కొన్నేండ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జనరల్ కేటగిరి అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. తమకు ఏదో ఒక పదవికి రిజర్వేషన్లు అనుకూలంగా వస్తాయని అంచనా వేసిన వారికి ఎదురుదెబ్బ తగిలింది. జెడ్పీటీసీ స్థానాలు విషయంలో దాదాపుగా ప్రతి జిల్లాలో ఒకటీ, రెండు జెడ్పీటీసీలు మాత్రమే జనరల్ కేటగిరికి రిజర్వ్ అయ్యాయి. జనరల్ కేటగిరి అయిన స్థానాల్లోనూ మహిళలకు రిజర్వ్ కావడంతో పురుషులకు పోటీ చేయడానికి ఒకటీ, రెండు స్థానాలు మాత్రమే మిగిలాయి. ఆ ఒకటీ, రెండు మండలాల్లోని జనరల్ కేటగిరి నాయకులు మినహా మిగిలిన మండలాల్లోని నాయకులందరు తాము ఇక ఏం చేయాలనే దానిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అంచనాలు తలకిందులు
జెడ్పీటీసీ లేదా ఎంపీపీ లేదా సర్పంచ్ ఇలా ఏదో ఒకటి అయినా తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందని చాలా మంది నాయకులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రిపేర్ అయ్యారు. కానీ వారికి ఒక్క పదవి కూడా అనుకూలమైన రిజర్వేషన్ రాకపోవడంతో నిరాశ చెందారు. ఎమ్మెల్యే స్థానం తమకు దక్కే అవకాశాలు లేవని, మార్కెట్ కమిటీలు కూడా రిజర్వేషన్ విధానం ఉందని, ఇక స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ లేదా ఎంపీపీ కి ప్రయత్నిద్దామని అనుకుంటే.. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడితే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు మరొక అవకాశం వస్తే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందని భావించారు. అయితే అంచనాలు తలకిందులు కావడంతో నిట్టూరుస్తున్నారు.
అధికార పార్టీలోనే అధికం
ఈ సమస్య ఎక్కువగా అధికార పార్టీలోని జనరల్ కేటగిరి నాయకులకు ఎక్కువగా ఉన్నది. పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి జెండా మోశామని, కానీ తీరా అవకాశాలు వచ్చేసమయంలో ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన చెందుతున్నారు. ఇన్నాళ్లు ఆర్థికంగా కష్టనష్టాలకు ఓర్చామని, తమ ఎమ్మెల్యేను గెలిపించడంలో తీవ్రంగా కృషి చేశామని, ఆర్థికంగా ఖర్చు కూడా పెట్టుకున్నామని, ఎమ్మెల్యే గెలిస్తే తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశతో పనిచేశామని, ఇప్పుడు అలాంటివి అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల వివరాలను తెలిసినప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. వారి అనుచరులు, పెద్ద నాయకులతో చెప్పి గోడు వెల్లబోసుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో తమకు ఎంపీపీ లేదా జెడ్పీటీసీ అవకాశం ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని, గెలిచాక కూడా చెప్పారని, తీరా రిజర్వేషన్ల వరకు వచ్చే సరికి అనుకూలంగా రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మరో ఐదు సంవత్సరాలు రిజర్వేషన్ల కోసం వేచి చూడటమా? లేక క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగడమా అనే దానిపై చర్చించుకుంటున్నారు. వ్యాపారం, వ్యవసాయం చేసుకొని పార్ట్ టైంగా రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని, ఆర్థికంగా బలపడితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని తమను తాము ఓదార్చుకుంటున్నారు. అయితే తమను నమ్ముకొని పార్టీ కేడర్ ఉందని, తాము రాజకీయాల నుంచి వైదొలిగితే వారికి అన్యాయం జరుగుతుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీ కోసం కొన్నేండ్లుగా అప్పులు, సప్పులు చేసి, భూములు అమ్ముకొని, వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బును ఖర్చు చేసి రాజకీయాల్లో తిరిగామని, అటు కుటుంబానికి సమయం కేటాయించకుండా, రాజకీయాలకు పనికి రాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






