కొలిక్కి వచ్చిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు.. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు!

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి.

కొలిక్కి వచ్చిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు.. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు, పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు, మూడు విడతల్లో పోలింగ్​నిర్వహించాలని కోరారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా.. సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. రిజర్వేషన్లు ఖరారు కాగానే మరోసారి రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించి డెసిషన్ తీసుకోనున్నది.

రిజర్వేషన్ల జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియలో భాగంగా రిజర్వేషన్‌లు కొలిక్కి వచ్చాయి. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల జాబితాను జిల్లా కలెక్టర్లు సీజ్​చేసి భద్రపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇవ్వగానే మహిళా రిజర్వేషన్లను పార్టీ నాయకుల సమక్షంలో డ్రా తీసి అధికారికంగా గెజిట్‌ను విడుదల చేస్తారు. బీసీ జీవో విడుదలయ్యే వరకు రిజర్వేషన్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బుధవారం బీసీ రిజర్వేషన్​జీవో ఇస్తామని అప్పటి కల్లా రిజర్వేషన్లు అన్ని ఖరారు చేసుకొని సిద్ధంగా ఉంచాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రిజర్వేషన్ల జాబితాను మంగళవారం మరో సారి సరిచూసుకొని జాబితాను సీజ్​చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసిన అనంతరం అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్​శాఖ మరొక జీవోను విడుదల చేస్తుంది. దాని ఆధారంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు చేసినట్టుగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు అధికారికంగా గెజిట్​విడుదల చేస్తారు.

ఆర్వోలను అపాయింట్​ చేయండి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్​ఎన్నికలకు రిటర్నింగ్​ఆఫీసర్​(ఆర్‌వో)లను అపాయింట్​చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఆర్‌వోలను నియమించినా.. ఈ మధ్య కాలంలో పదోన్నతులు, బదిలీలు, ఉద్యోగ విరమణలు జరగడంతో జాబితాను మరోసారి పరిశీలించి ఖాళీ స్థానాల్లో కొత్త వారిని నియమించనున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అపాయింట్‌మెంట్​పూర్తయ్యాక వారికి వారికి శిక్షణ ఇస్తారు. వీరితో పాటుగా మైక్రో అబ్జర్వర్‌లను అపాయింట్​ చేయాలని, రిసెప్షన్​సెంటర్​లను మరోసారి తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం మంగళవారం వేరు వేరుగా మూడు ఆదేశాలు జారీ చేసింది.

Next Story