పరిశోధనలే ఉత్పత్తులుగా మారాలి.. ఏరోనాటికల్ సొసైటీ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

by Kema Shiva Kumar |

భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

పరిశోధనలే ఉత్పత్తులుగా మారాలి.. ఏరోనాటికల్ సొసైటీ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికే వ్యూహాత్మక కేంద్రంగా (Strategic Hub) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ గచ్చిబౌలిలో జరిగిన ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ఆర్ అండ్ డీ (R&D), అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అనే మూడు అంశాలను అనుసంధానించడం ద్వారా ఏరోస్పేస్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.

42 వేల కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం..

దేశంలో అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు ఉన్నప్పటికీ, ల్యాబ్‌లలో జరిగే పరిశోధనలు కేవలం 30 శాతం మాత్రమే వాణిజ్య ఉత్పత్తులుగా మారుతున్నాయని, ఆ అంతరాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42 వేల కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం ఉంటుందని అన్నారు. ఈ భారీ డిమాండ్‌ను అందుకోవడానికి హైదరాబాద్‌లోని 1,500కు పైగా ఎంఎస్‌ఎంఈలు (MSMEs) సిద్ధంగా ఉన్నాయని, ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని శ్రీధర్ బాబు కొనియాడారు.

సర్టిఫికేషన్ కోసం విదేశాలపై ఆధారపడొద్దు..

అదేవిధంగా ప్రస్తుతం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపై ఆధారపడటం వల్ల సమయం, ఖర్చు పెరుగుతున్నాయని.. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని మంత్రి కోరారు. డ్రోన్లు, ఏఐ ఏవియానిక్స్, 3డీ ప్రింటింగ్, రీయూజబుల్ రాకెట్లు వంటి అధునాతన అంశాల్లో తెలంగాణను ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్, డీజీ సీఎస్ఐఆర్ డీ.ఎన్ కళైసెల్వి, ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ సోమనాథ్, తదితరులు పాల్గొన్నారు. ఏరోస్పేస్ రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా సత్కరించారు.

Next Story