రియల్ ఎస్టేట్ సంస్థలపై RERA యాక్షన్.. భారీ జరిమానాలకు రంగం సిద్ధం!

by Disha Web Desk 2 |
రియల్ ఎస్టేట్ సంస్థలపై RERA యాక్షన్.. భారీ జరిమానాలకు రంగం సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని కంపెనీలు కస్టమర్లను దగా చేస్తున్నాయి. అనుమతులు తీసుకోకముందే మార్కెట్ చేస్తున్నాయి. పర్మిషన్ దక్కినా పరిమితికి మించిన స్థలాలను అమ్మేందుకు యత్నిస్తున్నాయి. అభూత కల్పనలు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకోవాలని యత్నిస్తున్నాయి. డిసెంబరు 14న కోకాపేటలో ప్రెస్టేజ్ అనే ప్రఖ్యాత సంస్థ 'ప్రీలాంచ్ కాదు.. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' అనే శీర్షికన ఆఫర్లతో జనానికి ఫ్లాట్లను అమ్మాలని చూస్తుందంటూ వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే డిసెంబరు 19న 'అలేఖ్య అంతులేని దగా', జనవరి ఆరో తేదీన 'ఫార్చూన్ ఫ్రాడ్', జనవరి 23న 'ఏవీ ఇన్ఫ్రా బ్లాక్ దందా. బై బ్యాక్ పేరిట భారీ స్కెచ్' అనే శీర్షికలతో పలు అంశాలను తీసుకొచ్చింది. ఇప్పుడు వీటన్నింటిపైనా తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ(టీఎస్ రెరా) యాక్షన్ తీసుకోబోతున్నది. ఇప్పటికే కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేసింది. మరికొన్నింటికి త్వరలోనే నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కొన్ని సంస్థలకు రూ.కోట్లల్లో జరిమానా విధించనుండడం విశేషం. జనాన్ని బురిడీ కొట్టించాలని చూసే ప్రతి సంస్థకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే మోస‌పూరిత రియ‌ల్ సంస్థల జాబితాను తెలంగాణ రెరా అథారిటీ సిద్ధం చేసింది.

రెరా గుర్తిస్తేనే కొనాలి

న‌గ‌రానికి నాలుగువైపులా దాదాపు ప‌ద్నాలుగు రియ‌ల్ సంస్థలు వేసిన వెంచ‌ర్లలో ప్లాట్లను కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేస్తోంది. ఈ మేర‌కు రెండో జాబితాను విడుద‌ల చేయ‌డానికి రెరా అథారిటీ సిద్ధమైంద‌ని స‌మాచారం. భువ‌నతేజ ఇన్‌ఫ్రా, ఆర్‌జే హోమ్స్‌, ఏవీ ఇన్‌ఫ్రాకాన్ వంటి సంస్థల‌కు ఇది వ‌ర‌కే రెరా అథారిటీ నోటీసుల‌ను పంపించింది. ఐతే కంపెనీలు ఇంత‌ వ‌ర‌కు స్పందించ‌లేదు. రెరా నోటీసును బేఖాత‌రు చేస్తూ ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించిన ఈ సంస్థల‌పై ప్రాజెక్టు విలువ‌లో ప‌దిశాతం జ‌రిమానాను విధించ‌డానికి రెరా అథారిటీ స‌మాయ‌త్తం అవుతుంద‌ని తెలిసింది. విజ‌య‌వాడ హైవే మీద చౌటుప్పల్‌, సూర్యాపేట్‌.. ముంబై హైవే మీద గ‌ల సంగారెడ్డి, స‌దాశివ‌పేట్‌, నారాయ‌ణ్‌ఖేడ్‌, బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి మీద గ‌ల షాద్ న‌గ‌ర్‌, జ‌డ్చర్ల, సాగ‌ర్ రోడ్డు, శ్రీశైలం హైవే, వ‌రంగ‌ల్ హైవే మీద ఆలేరు, యాదాద్రి వంటి ప్రాంతాల్లో ఈ ప‌ద్నాలుగు సంస్థలు రెరా అనుమ‌తి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నార‌ని రెరా గుర్తించింది. ఆయా వెంచ‌ర్లలో ఎవ‌రూ కొన‌కూడ‌ద‌ని కోరుతోంది. రెరా అనుమ‌తి తీసుకున్న వెంచ‌ర్లలోనే ప్లాట్లు, ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాల‌ని సూచిస్తున్నది.

పరిమితికి మించి..

కొన్ని రియ‌ల్ సంస్థలు 10, 20 ఎక‌రాలకు అనుమ‌తి తీసుకొని వంద‌ల ఎక‌రాలను మార్కెట్లో పెడుతున్నాయి. ప్రశ్నిస్తే మొత్తం వెంచ‌ర్‌కు రెరా అనుమ‌తి ల‌భించింద‌ని ప్రచారం చేస్తున్నాయి. రికార్డుల‌ను ప‌రిశీలించిన రెరా అధికారులు అబద్ధాలను గుర్తించారు. ఈ సంస్థ వ‌ద్ద ప్లాట్లు కొనేవారు అనుమతులు పొందినంత వరకే ప్లాట్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఏ ఫేజ్‌లో కొంటున్నార‌నే విష‌యాన్ని తెలుసుకున్నాకే సొమ్ము చెల్లించాల‌ని రెరా చెబుతోంది.

ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌‌కు జ‌రిమానా?

బెంగ‌ళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అనే సంస్థ కోకాపేట్లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన విష‌యం రెరా దృష్టికి వ‌చ్చింది. ఇటీవ‌ల ఈ కంపెనీ రెరా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఐతే ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన విష‌యం గుర్తించిన రెరా అథారిటీ ప్రతి ఫ్లాటు మీద రూ.25 వేలు జ‌రిమానా విధించ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్నది. ఈ సంస్థ 500లకు పైగా ఫ్లాట్లను ప్రీలాంచ్‌లో విక్రయించినట్లు సమాచారం. లెక్కిస్తే పెనాల్టీ రూ.కోట్లల్లో చెల్లించాల్సి వస్తుంది. ఐతే ఈ సంస్థ ప్రీలాంచ్‌కి కొత్త పేరు పెట్టింది. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ప్రచారం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని 'దిశ' చెప్పింది.

ఈ సంస్థల వద్ద ప్లాట్లు కొనొద్దు

రెరా చ‌ట్టం 2016 సెక్షన్ 3(1), 4 (1) ప్రకారం.. ఎలాంటి అనుమ‌తుల్లేవ‌ని రెరా అథారిటీ తెలియ‌జేసింది. రెరా చ‌ట్టంలోని సెక్షన్‌ 3(1) ప్రకారం రెరా అనుమ‌తి లేకుండా ఎలాంటి ప్లాటు, ఫ్లాటు విక్రయించ‌కూడ‌దు. ఇక నుంచి రెరా అనుమ‌తి లేని వెంచ‌ర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు విక్రయించ‌కూడ‌ద‌ని, అలా అమ్మే వాటిలో కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని తెలియ‌జేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య స‌ముదాయాల్లో కొనుగోలు చేసేవారు.. వాటికి రెరా అనుమ‌తి ఉందా? లేదా? అనే విష‌యాన్ని రెరా వెబ్‌సైటులో తెలుసుకున్నాకే ముంద‌డుగు వేయాల‌ని సూచించింది. ఇందుకోసం రెరా వెబ్‌సైటు (https://rerait.telangana.gov.in /SearchList /Search)ను చూడాల‌ని కోరింది. యూనిక్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ పిగ్లీపూర్ గ్రామం, 17/1 స‌ర్వే నెంబ‌ర్ వేసిన వెంచ‌ర్‌, సూర్యాపేట్ వ‌ద్ద ఎలైట్ సాయి డెవ‌ల‌ప‌ర్స్ వంటి వెంచ‌ర్ల‌లో ప్లాట్లు కొన‌కూడ‌ద‌ని అంటోంది.

రెరా సిద్ధం చేసిన జాబితా ప్రకారం సంగారెడ్డిలో అలేఖ్య ఇన్‌ఫ్రా డెవ‌ల‌ప‌ర్స్, సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో కేవీఎస్ హోమ్స్, సంగారెడ్డి జిల్లా పెద్దపూర్‌లో అలేఖ్య ఎస్టేట్స్, సూర్యాపేట జిల్లాలో అక్షితా ఇన్‌ఫ్రా, రాజాపూర్ లో విశ్వ డెవ‌ల‌ప‌ర్స్‌, యాచారం మండలం నందివనపర్తిలో 101 ఎక‌ర్స్‌, ఫార్మా ఎలైట్‌, అమేజ్‌, ఫార్మా నేచ‌ర్ సిటీ, భువ‌నతేజ ఇన్‌ఫ్రా, ఆర్‌జే హోమ్స్‌, ఏవీ ఇన్‌ఫ్రాకాన్ వెంచర్లు.. ఇలా అనేక సంస్థలు ఉన్నాయని తెలిసింది.

Also Read..

వివాదాస్పదంగా పట్టాలిచ్చిన భూమిలో పంచాయతీ భవన నిర్మాణం..



Next Story

Most Viewed