Bathukamma: బతుకమ్మ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

స‌మ‌తా మమ‌తలు వెల్లివిరిసేలా సంప్ర‌దాయబ‌ద్ధంగా బ‌తుక‌మ్మ పండ‌గ‌ను జరుపుకుందామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

Bathukamma: బతుకమ్మ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స‌మ‌తా మమ‌తలు వెల్లివిరిసేలా సంప్ర‌దాయబ‌ద్ధంగా (Bathukamma) బ‌తుక‌మ్మ పండ‌గ‌ను జరుపుకుందామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Minister Jupally Krishnarao) పిలుపునిచ్చారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో బతుకమ్మ విశిష్టత - ఆచరణ అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి జూప‌ల్లి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. కొన్ని త‌రాలుగా గ్రామీణ మ‌హిళ‌ల నోళ్ల‌ల్లో నానుతున్న బ‌తుక‌మ్మ‌ పాట‌ల‌ స్పూర్తిని మ‌రింత వెలుగులోకి తీసుకురావాల‌ని అన్నారు. డీజే మోత‌ల‌తో కాకుండా, ఆడుతూ పాడుతూ చ‌ప్పట్ల స‌ప్పుడు, స‌వ్వ‌డితో సంబ‌రాలు జ‌రుపుకుందామ‌ని అన్నారు. బతుకమ్మ సందర్భంగా జీవన విధ్వంసంపై పాటలు అల్లి పాడుకోవాలని కోరారు. మ‌రోవైపు జీవ‌న విధ్వంసం, అంత‌రించిపోతున్న మాన‌వతా విలువ‌లను పెంపొందించడంతో పాటు సామాజిక రుగ్మ‌త‌ల‌కు వ్య‌తిరేకంగా క‌వులు, ర‌చ‌యిత‌లు పాటలు, సాహిత్యం రాయాల‌ని, వాటిని బ‌తుక‌మ్మ లాంటి పండ‌గ సంద‌ర్భాల్లో వివిధ క‌ళా రూపాల్లో విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవాల‌ని సూచించారు.

ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహా మండలి కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, జూపాక సుభద్ర, భవాని రెడ్డి, ఇందిరా శోభ సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు బి. నర్సింగరావు, కవి యాకూబ్, బాద్మీ శివకుమార్, ముచ్చర్ల దినకర్, నేర్నాల కిషోర్, దరువు ఎల్లన్న , దరువు అంజన్న, ఒగ్గు రవి, చక్రాల రఘు, ఖాజా పాషా, పల్లె నరసింహ తో పాటు ఈ కార్యక్రమంలో అభినయ శ్రీనివాస్, అంబటి వెంకన్న, యశ్ పాల్ , కోదాటి శ్రీను, జ్వలిత, నారాయణమ్మ, చిత్రకారులు రమణారెడ్డి, సాంస్కృతిక సారథి అధికారి విజయ్ తో పాటు కవులు, కళాకారులు, మేధావులు సదస్సులో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

బతుకమ్మ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు..

ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ పండుగను వైభ‌వంగా నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అసోసియేష‌న్ ప్రతినిధులతో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును స‌మావేశ‌మ‌య్యారు. బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొని కళను, సంస్కృతిని ప్రదర్శించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఈ సాంప్రదాయం లేదని, బ‌తుక‌మ్మ‌ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 18 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story