- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువుల పునరుద్ధరణలో నివాసాలున్న ఇళ్లను కూల్చబోం: హైడ్రా కమిషనర్
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైడ్రా మొదటి విడతగా చేపట్టిన 6 చెరువులలో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులను ఆయన ఈ సందర్భంగా సందర్శించారు. స్థానికులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు.
నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఏవీ రంగనాథ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ బాధ్యతను హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని అన్నారు. మిగతా ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఈ పనిని చేపడుతున్నామన్నారు. స్థానికుల నుంచి కూడా మంచి సహకారం అందడం ఆనందించదగ్గ విషయమని, త్వరలోనే చెరువుల్లో జీవకళ అందరూ చూస్తారని ఆయన అన్నారు. చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ కింద సహాయం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే నివాసాలున్న ఇళ్లను కూల్చబోమన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్లో ఎక్కడా నివాసాలను తొలగించమని స్పష్టం చేశారు.
చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణతో తమ ప్రాంతాలన్నీ ప్రాధాన్యతను సంతరించుకుంటాయని రంగనాథ్ చెప్పారు. దాదాపు రూ.58.50 కోట్లతో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, రాజేంద్రనగర్ లోని భమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువు, బతుకమ్మ కుంట చెరువులను మొదటి విడతగా హైడ్రా అభివృద్ధి చేస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం ఈ చెరువులలో డీ వాటరింగ్ పనులను హైడ్రా చేపట్టింది. ముందుగా చెరువుల్లో ఉన్న వ్యర్థ జలాలను బయటకు పంపి డ్రై చేస్తున్నారు. ఇలా వివిధ దశల్లో జరుగుతున్న పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
వచ్చే జూన్ నాటికి ఈ చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో హైడ్రా ముందుకెళ్తోంది. నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు సంబంధించి విమోస్ టెక్నోక్రాట్స్ రూపొందించిన DPR (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు), కాన్సెప్ట్‌లను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.






