- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: వచ్చే ఏడాది ఆ కోర్సుల తొలగింపునకు చర్యలు
రాష్ర్ట ఉన్నత విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) శ్రీకారం చుట్టనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట ఉన్నత విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) శ్రీకారం చుట్టనుంది. ఉన్నత విద్యను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రాచుర్యం లేని, డిమాండ్ లేని పీజీ కోర్సులను దశల వారీగా తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. వనరులను వ్రుధా చేయకుండా, విద్యార్థులకు ఉపయోగపడే ఇతర కోర్సుల వైపు మళ్లించేలా కోర్సుల్లో మార్పు చేయనున్నారు. శనివారం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది ఉన్నత విద్యామండలి ప్రాంతీయ అకడమిక్, ఇన్నోవేషన్ క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఏఐ ఆధారిత పాలనా వ్యవస్థలను విస్తరించడంతో పాటు పరిశ్రమలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారాన్ని మరింత పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ పోటీతత్వం, డిజిటల్ ఆధారితంగా మార్చడమే తమ విజన్ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ . వి. బాలకిష్టా రెడ్డి అన్నారు.
అవసరమున్న వారికి ఆంగ్ల విద్య:
గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఆంగ్ల విద్య అవసరమున్న వారి వద్దకు ఆంగ్ల విద్యను తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి పలు ఆరు అంశాలతో ఒక బుక్ రూపొందించామని, ఆ బుక్ పీడీఎఫ్ ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందన్నారు. అందులో అంతర్జాతీయ అంశాలు, కాకుండా మన తెలంగాణ కల్చర్, ట్రెడిషన్ ను ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరికి సులువులుగా అర్థమయ్యే అంశాలుంటాయని తెలిపారు.
ఆన్‌లైన్‌లో బీ కేటగిరి సీట్ల భర్తీ:
వచ్చే ఏడాది నుంచి కళాశాలల్లోని బీ-కేటగిరి సీట్ల భర్తీ ప్రక్రియను కూడా ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకత పెరుగుతుందన్నారు. విద్యార్థుల్లో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే నైపుణ్యాలను పెంపొందించేలా ప్రస్తుత సిలబస్‌లో మార్పులు చేయాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. నాస్కామ్ తో భాగస్వామ్యం ద్వారా ఏటా లక్ష మంది అభ్యాసకులకు ఏఐ, ఫిన్టెక్ , సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యాన్ని పెంచనున్నారు. బీడీఎంఏఐతో ఫార్మా ఆర్ అండ్ డీ, తయారీలో శిక్షణ కోసం ఒప్పందం చేసుకున్నామన్నారు. అకడమిక్ భారాన్ని తగ్గించడానికి అండర్ గ్రాడ్యుయేట్ (బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, లా, బీబీఏ) కోర్సుల్లో మొత్తం క్రెడిట్లను 150 నుంచి 142కి తగ్గించినట్లు తెలిపారు. పర్యావరణం, సైబర్‌సెక్యూరిటీ, కమ్యూనికేషన్, వ్యవస్థాపకత వంటి అంశాలపై వాల్యూయాడెడ్ కోర్సులు, స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టారన్నారు.
అడ్మిషన్లు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు
ఐదు లక్షలకు పైగా అభ్యర్థులకు సంబంధించి ఈ ఏడాది అన్ని ప్రధాన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఎలాంటి అంతరాయం లేదా అక్రమాలు లేకుండా సజావుగా నిర్వహించామని తెలిపారు. దోస్త్ 2025 ప్రవేశ ప్రక్రియను సరళీకృతం చేసి, ఏకీకృత అడ్మిషన్ విండోను ప్రవేశపెట్టామని, గ్రామీణ కళాశాలల్లో నమోదు పెరిగిందన్నారు. తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చడానికి, యూకే, యూఎస్ ఏ, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధి బృందాలతో సహకరించడం జరిగింది. ఈ భాగస్వామ్యాలు డ్యూయల్ డిగ్రీలు, జాయింట్ రీసెర్చ్‌లకు మార్గం సుగమం చేశాయి.






