- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విల్లా కొనుగోలుదారులకు ఊరట.. బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌కు రెరా అల్టిమేటం
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కొంపల్లిలోని ‘బాలాజీ ఎలిగాన్సియా’ విల్లా ప్రాజెక్ట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు, వసతులను తక్షణమే పూర్తి చేయాలని బాలాజీ కన్ స్ట్రక్షన్స్‌ను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కొంపల్లిలోని ‘బాలాజీ ఎలిగాన్సియా’ విల్లా ప్రాజెక్ట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు, వసతులను తక్షణమే పూర్తి చేయాలని బాలాజీ కన్ స్ట్రక్షన్స్‌ను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) ఆదేశించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ & డెవలప్‌మెంట్) చట్టం, 2016 ప్రకారం ప్రమోటర్ల బాధ్యతను ఈ ఉత్తర్వుల ద్వారా రెరా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. రెరా ఆదేశాలను అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
గడువు ముగిసినా..
ప్రాజెక్ట్ మార్కెటింగ్ బ్రోచర్లు, అమ్మకపు ఒప్పందాలలో వాగ్దానం చేసిన ప్రీమియం వసతుల ఆధారంగా విల్లాలు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల తరపున ‘బాలాజీ ఎలిగాన్సియా విల్లా ఓనర్స్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ లిమిటెడ్’ ఆధ్వర్యంలో రెరాలో ఫిర్యాదు (నెం, 375/2025) చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయి క్లబ్ హౌస్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ), నీటి శుద్ధి ప్లాంట్ (డబ్ల్యూటీపీ), 100శాతం పవర్ బ్యాకప్, విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని బిల్డర్ హామీ ఇచ్చారు. నిర్మాణ పురోగతిని నిష్పాక్షికంగా అంచనా వేయడానికి, అథారిటీ ఆదేశాల మేరకు ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ)’ చేత తనిఖీ నిర్వహించబడింది. ఈ నిపుణుల బృందం సమర్పించిన నివేదికలో పలు విల్లాలు ఇప్పటికే నివాసంలో ఉన్నప్పటికీ, కీలకమైన పౌర సదుపాయాలు, సాధారణ వినోద వ్యవస్థలు ఇంకా పూర్తి కాలేదని, ప్రాజెక్ట్ గడువు సెప్టెంబర్ 1, 2024 నాటికే ముగిసినప్పటికీ పనులు తీవ్రంగా ఆలస్యమయ్యాయని నిర్ధారించబడింది.
సెక్షన్ 37, 38 ప్రకారం..
రెరా చట్టం లోని సెక్షన్ 37, 38 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి, ప్రాజెక్ట్ పొడిగింపు దరఖాస్తు పెండింగ్‌లో ఉందనే కారణాన్ని మరియు నివాసితుల సంఘం అర్హతపై డెవలపర్ లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను అథారిటీ పూర్తిగా తిరస్కరించింది. ఒక ప్రాజెక్ట్‌లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ యూనిట్లు నివాసంలోకి వచ్చినప్పుడు, వాగ్దానం చేసిన మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా అందించడం డెవలపర్ బాధ్యత. గతంలో ఇస్కీ కమిటీ ముందు డెవలపర్ స్వచ్ఛందంగా అంగీకరించిన కాలక్రమం ప్రకారమే పెండింగ్‌లో ఉన్న అన్ని ఉమ్మడి వసతులను పూర్తి చేయాలని అథారిటీ ప్రతివాదిని ఆదేశించింది.
ముఖ్యంగా, ఇప్పటికే గడువు ముగిసిపోయిన మౌలిక సదుపాయాల పనులను ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి 60 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని బిల్డర్‌కు గడువు విధించింది. ఈ ఆదేశాలను, నిర్దేశిత కాలక్రమాలను ఉల్లంఘిస్తే చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం ప్రమోటర్‌పై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోనున్నట్టు టీజీ రెరా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల రక్షణ, సంపూర్ణ పారదర్శకతను కాపాడటంలో నియంత్రణ సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించింది.






