వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2026-03-17 13:03:37  IST  )

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఎప్పుడు ఎలాంటి పిడుగు తమపై పడుతుందో అనే ఆందోళన భారత్‍లోని వాహనదారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళిక లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే భారత్‍లో పెట్రోల్, డీజిల్ విషయంలో రకరకాల వదంతులు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. దీంతో అనేక మంది తమకు అవసరం లేకపోయినా పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ గ్యాస్ కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో ఎవరూ ఇంధనం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడ నిల్వలు దేశంలో ఉన్నాయన్నారు. వాణిజ్య ఎల్‍పీజీ వినియోగదారులు పీఎన్‌జీ (పైప్‌డ్ నేచురల్ గ్యాస్)కి మారితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం:

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త తనిఖీలను ముమ్మరం చేసిందని గత కొద్ది రోజులుగా జరిపిన దాడుల్లో భారీగా అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సుజాత శర్మ తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా 12,000 దాడులు నిర్వహించి,15,000 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఇన్‌స్పెక్షన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయని సుమారు 2,500 రిటైల్ అవుట్‌లెట్లు మరియు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఆ ప్రచారం అబద్ధం:

కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన రాజేష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ రెండవ ఎల్‌పీజీ క్యారియర్ ‘నందా దేవి’ ఇవాళ తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు కాండ్లా పోర్టుకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం ‘శివాలిక్’, ‘నందా దేవి’ ఎల్‌పీజీ నౌకల నుంచి డిశ్చార్జ్ జరుగుతోందన్నారు. ‘నందా దేవి’ నౌకలో కార్గో డిశ్చార్జ్ ‘షిప్-టు-షిప్’ విధానంలో జరుగుతోందని అంటే మదర్ షిప్ నుంచి డాటర్ షిప్‌కు మారుస్తున్నారని వెల్లడించారు. ఈ ఉదయం జవహర్లాల్ నెహ్రూ పోర్టులో సుమారు 450 కంటైనర్లు రోడ్డుపై పడి ఉన్నాయనే వార్తలను ఆయన ఖండించారు.

Next Story