రెగ్యులరైజేషనా..? కాంట్రాక్టా..? జేపీఎస్‌లపై సర్కారు నో క్లారిటీ!

by Disha Web Desk 4 |
రెగ్యులరైజేషనా..? కాంట్రాక్టా..? జేపీఎస్‌లపై సర్కారు నో క్లారిటీ!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన సర్కారు తన తప్పును కప్పిపుచ్చుకుని పంచాయతీ కార్యదర్శులపైకి నెడుతుందని ఆ సంఘం నేతలు మండిపడుతున్నారు. ఐదేళ్ల కిందట రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో 3 ఏళ్ల ప్రొబేషనరీ అని మాత్రమే పేర్కొందని.. తాజాగా జారీచేసిన నోటీసులో కాంట్రాక్టు అని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపిస్తున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులకు ఆధారంగా మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో పంచాయతీ కార్యదర్శులుగా ప్రభుత్వం నియమించిందని, మూడేళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పుడు డిమాండ్ చేసే హక్కే లేదని వార్నింగ్ ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వమే జీవోలను ఉల్లంఘిస్తూ ప్రజల దృష్టిలో తమను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంప్లాయ్ ఫ్రెండ్లీ అంటూనే..

ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటూనే పంచాయతీ కార్యదర్శులపై కఠినంగా వ్యవహరించడాన్ని ఎత్తిచూపుతున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తమపై కీలక బాధ్యత ఉందని ఆ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంలో ఇచ్చిన హామీ అమలుకు మాత్రం సుముఖంగా లేదని గుర్తు చేశారు. జూనియర్‌, ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో ఏప్రిల్‌ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ముందుగానే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామన్నారు. తొలుత ప్రొబేషన్ పీరియడ్ 3 ఏళ్లు ఉన్నా ప్రభుత్వం దాన్ని మరో ఏడాది పెంచిందన్నారు. అయినా తాము రెగ్యులర్ అవుతానమే నమ్మకంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.

నోటిఫికేషన్‌లోనే స్పష్టత

ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత 2018లో తొలి నియామక ప్రకటన పంచాయతీరాజ్‌ శాఖ నుంచే వెలువడింది. మొత్తం 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రకటనను ఇచ్చింది. రాతపరీక్ష తర్వాత మెరిట్‌ లిస్టు మేరకు 2019 ఏప్రిల్‌లో నియామకాలు చేపట్టింది. 3 ఏళ్ల ఒప్పంద పద్ధతిలో పనిచేశాక గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శిగా రెగ్యులైజేషన్ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో సర్కారు పేర్కొంది. బాధ్యతల్లో చేరాక సుమారు 2 వేల మంది పనిభారం, ఇతర జాబ్ లు రావడం తదితర కారణాలతో మానివేశారు. ప్రభుత్వం తొలుత ప్రకటించినట్లుగా 3 ఏళ్ల ప్రొబేషన్ అమలైనట్లయితే ఇప్పటికే రెగ్యులరైజ్ అయ్యేవారంటూ పంచాయతీ కార్యదర్శులు గుర్తు చేస్తున్నారు. మరో ఏడాది ప్రొబేషన్ కాలాన్ని పొడిగించినా ఆ గడువు కూడా గత నెల 11వ తేదీతో ముగిసిపోయింది. కానీ రెగ్యులరైజ్ పై రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై గతంలోనే అనుమానాలు వచ్చాయంటూ పలువురు పంచాయతీ కార్యదర్శులు ఉదహరించారు.

పలు జిల్లాల్లో ఇలా..

ఖమ్మం జిల్లాలో ఔట్‌సోర్సింగ్, అడ్‌హక్‌ పంచాయతీ కార్యదర్శులుగా నియమితులైన 76 మందిని రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా మారుస్తూ 2021 సెప్టెంబరు 1న ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహాలో 2022 మార్చి 4న ఆదేశాలు వెలువడ్డాయని గుర్తుచేశారు. కరీంనగర్‌కు చెందిన వారధి సొసైటీ ద్వారా జగిత్యాల జిల్లాలో నియమితులైన ఐదుగురు ఔట్‌సోర్సింగ్ జేపీఎస్‌లను 2021 అక్టోబరు 28న రెగ్యులరైజ్ చేసినట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీసాయి యూత్‌ అసోసియేషన్‌ ఏజెన్సీ ద్వారా ఎంపికైన ఔట్‌సోర్సింగ్ జేపీఎస్‌లను 2022 జనవరి 31న, సిరిసిల్ల జిల్లాలో ఎనిమిది మంది అడ్‌హక్ జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేశారని గుర్తుచేశారు.

ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వమే చెప్పిందని, నెల జీతాన్ని (రెమ్యునరేషన్) రూ. 15,000 నుంచి రూ. 28,719గా పెంచుతూ 2021 జూలై 15న ఉత్తర్వులు (జీవో నెం.26) జారీచేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వమే రూపొందించిన మోడల్ అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారన్నారు. అగ్రిమెంట్ అని ప్రభుత్వం పేర్కొంది తప్ప ఎక్కడా కాంట్రాక్టు పదాన్నే వాడలేదని, ఇప్పుడు సమ్మె సందర్భంగా హెచ్చరించిన నోటీసులో మొదటిసారి వాడి తమను గందరగోళంలోకి నెట్టిందని శ్రీనివాస్ పేర్కొంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed