- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేమ్ ఛేంజర్‌గా రీజినల్ రింగ్ రైలు.. మారనున్న తెలంగాణ రూపురేఖలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు సమాంతరంగా నిర్మించబోయే రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు సమాంతరంగా నిర్మించబోయే రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది. కొత్త రవాణా విప్లవంగా భావించే ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా ఈ రైల్వే ప్రాజెక్టు ఉండనుంది. ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు అనుసంధానమయ్యే రింగ్ రైల్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రేవంత్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తికి కనీసం నాలుగైదేళ్లు పడుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. అందుకే త్వరలో భూసేకరణ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. అందుకు అవసరమైన సుమారు ఆరువేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. 392 కి.మీ. దూరం, 26 రైల్వేస్టేషన్లతో చేపట్టే ఈ రింగ్ రైలు ప్రాజెక్టుకు రూ.12,070 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, వాణిజ్య విస్తరణ, పట్టణ- గ్రామీణ అనుసంధానంతో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది పనులు
జులై 2025లో ఆమోదం పొందిన రింగ్ రైలుకు సంబంధించి రైల్వే శాఖ డీపీఆర్ తయారీ దశలో ఉంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత ఈ ఏడాది చివర, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పనులకు భూమిపూజ చేసే అవకాశం ఉందని రైల్వేవర్గాలు తెలిపాయి. భారీగా ఖర్చయ్యే ప్రాజెక్టు కావునా కనీసం నాలుగైదు ఏళ్ల సమయం పడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 8జిల్లాల మీదుగా ఈ రింగ్ రైలు వెళ్లనుంది. హైదరాబాద్ నగరానికి వచ్చే ముఖ్య రైల్వేలైన్లతో అనుసంధానం కానుంది. కనీసం 6 రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జీ నిర్మించే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్ట్ నుంచి కనెక్టివిటీకి కూడా మార్గాలను అన్వేషిస్తున్నారు. హైవేస్, రీజినల్ రింగ్ రోడ్డుతోనూ అనుసంధానం చేస్తూ ఈ రింగ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
సరుకు రవాణా మరింత సులభం
రింగ్ పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు వేగవంతమైన రైల్వేలింక్ ఏర్పడి ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుదలకు అవకాశం లభిస్తుంది. నగర రవాణా భారం తగ్గి శివారు ప్రాంతాల నుంచి నేరుగా కనెక్టివిటీ పెరిగి ట్రాఫిక్ ఒత్తిడి తగ్గితుంది. పరిశ్రమలు, డ్రైపోర్టులతో కలసి అంతర్రాష్ట్ర సరుకు రవాణా వేగవంతమవుతుంది. రైల్వేస్టేషన్ల చుట్టూ లాజిస్టిక్స్ పార్కులు, ఇండస్ట్రియల్ జోన్లు రూపుదిద్దుకోవడంతో అభివృద్ధికి అవకాశం పెరుగుతుంది. నగర అంతర్గత మెట్రో, బస్సులతో కలసి రూరల్- సబ్‌అర్బన్-టు-సిటీ ప్రయాణం మరింత సులభతరంగా మారనుంది. రాబోయే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల(మీర్ ఖాన్‌పేట్, రావిర్యాల తదితర ప్రాంతాలు) కు రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రం ప్రోత్సహిస్తున్న డ్రైపోర్టు, లాజిస్టిక్స్ పార్కులు రింగ్ రైలుతో అనుసంధానమై సరుకు రవాణా మరింత సులువు అవుతుంది. రింగ్ రైలు రాకతో రింగ్ పరిధిలోని పట్టణాలు, గ్రామాలు నూతన అభివృద్ధి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. చిన్న పట్టణాలు.. పరిశ్రమలు, వ్యాపార హబ్‌లుగా ఎదిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంపై ఆధారపడే ఒత్తిడి తగ్గి మల్టీనోడల్ గ్రోత్ కు అవకాశం ఏర్పడనుంది.
అడ్డంకులు లేకుండా ప్రజా రవాణా
డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ లేకపోవడంతో ప్రస్తుతం దేశీయ రైల్వేలైన్లపై ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నగరానికి వచ్చే రైళ్లను సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ వంటి ప్రధాన టెర్మినల్స్ కు చేరుకునేందుకు ముందుగా శివారు స్టేషన్లలో గంటల కొదీ ఆపివేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ చేరుకునేందుకు సూపర్ ఫాస్ట్ రైళ్లకే ఒక్కోసారి ట్రాఫిక్ రద్దీ కారణంగా 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు సగటున 3గంటల మేర సమయం పడుతుంది. కేవలం 105 కి.మీ. దూరానికి ఇంత సమయం అంటే గంటకు రైళ్ల సగటు వేగం 35 కి.మీ.కు మించడం లేదు. రింగ్ రైలు ప్రారంభమైతే ప్రైవేట్ రవాణా ప్రధాన లైన్ల నుంచి వికేంద్రీకరిస్తారు. గూడ్స్ రైళ్లు నగరం లోపలికి రాకుండానే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుంది. దీంతో ప్రయాణికుల రైళ్లు సకాలంలో చేరుకునేందుకు వీలవుతుంది. దాంతో పాటు కొత్తగా నగర శివారులో ఏర్పడే రైల్వేస్టేషన్లు, ఇంటర్ ఛేంజ్ తో సమీప ప్రాంతాలకు ఇతర ప్రజారవాణా వ్యవస్థల ద్వారా త్వరగా చేరుకోవచ్చు. నగరంలో రైళ్ల రద్దీ తగ్గి సమయానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
అనుసంధానమయ్యే ప్రధాన రైల్వే లైన్లు
సికింద్రాబాద్- డోన్
సికింద్రాబాద్- కాజీపేట
సికింద్రాబాద్- వాడి (గుల్బర్గా)
సికింద్రాబాద్- ముద్ఖేడ్ (నాందేడ్)
సికింద్రాబాద్- గుంటూరు
సికింద్రాబాద్- కొత్తపల్లి (కరీంనగర్)






