తెలంగాణలోని ఆ 11 జిల్లాల భూములకు రెక్కలు..

by Gantepaka Srikanth |

ట్రిపుల్ ఆర్‌ను ఆనుకునే రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

తెలంగాణలోని ఆ 11 జిల్లాల భూములకు రెక్కలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపుల్ ఆర్‌ను ఆనుకునే రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు కోసం సుమారు వంద మీటర్లతో భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంతోపాటే రైల్వే లైన్ కోసం మరో 50 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపితే సుమారు 400 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. రీజనల్ రింగ్, రీజనల్ రింగ్ రైలు రానుండడంతో 11 జిల్లాల్లోని భూములకు రెక్కలు రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే చుట్టు పక్కల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పెరగనున్నాయి. దీంతో రియల్ బూమ్ మరింత పెరిగే అవకాశముందని పలువురు డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

100 వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (హెచ్ఎంఆర్) పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డు (త్రిపుల్ ఆర్) అలైన్ మెంట్ ఖరారు చేస్తూ హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి 8 జిల్లాలు, 33 మండలాల పరిధిలోని 163 గ్రామాలకు చెందిన డిజిటల్ మ్యాప్, ఆయా గ్రామాల్లోని పలు సర్వే నెంబర్లతో కూడిన వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సైట్ పెట్టారు. త్రిపుల్ ఆర్ వెళ్లే గ్రామాలకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పొందుపర్చారు. అయితే రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో త్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ ఖరారు చేశారు. మొత్తం 364 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగంలో 201 కిలోమీటర్లు, ఉత్తర భాగంలో 163 కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది.

50 మీటర్లలో రింగ్ రైలు..

రీజనల్ రింగ్ రోడ్డు వెంటే రీజనల్ రింగ్ రైలును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం పెద్దలతో చర్చించారు. అందుకు కేంద్రం సైతం అంగీకరించింది. ఒక పక్క రింగ్ రోడ్డు, మరో పక్క రింగ్ రైలుతో రవాణ వ్యవస్థ మెరుగుపడడంతోపాటు ఆ ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రీజినల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కోరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లగా.. రీజినల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం రీజినల్ రింగ్ రైలుకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెంచాలని రైల్వే అధికారులను ఆదేశించారు. రీజినల్ రోడ్డు వెంబడే రైల్వే లైను వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపితే రీజినల్ రింగ్ రైల్వే లైన్ దాదాపుగా 400 కిలోమీటర్ల అవుతుంది. ట్రిపుల్ ఆర్ వెంబడే రైల్వే లైను వేస్తే.. ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ లైన్ వెళ్లే ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల రూపు రేఖలు రాబోయే రోజుల్లో పూర్తిగా మారుతాయని విశ్లేషిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.

మరో గ్రోత్ కారిడార్..

ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్‌కు వెలుపల, బయట రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలుతో 8 జిల్లాల పరిధిలో మరో గ్రోత్ కారిడార్ ఏర్పాటుకాబోతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్డు, రైలు మార్గాలతో సమీప ప్రాంతాలతోపాటు 100 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Next Story