- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భూములకు రైతు భరోసా కల్పిస్తారా.. తొలగిస్తారా..?
గత ప్రభుత్వం రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందించగా ప్రస్తుత ప్రభుత్వం సాగు భూమికే అందిస్తామని పేర్కొంటోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: గత ప్రభుత్వం రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందించగా ప్రస్తుత ప్రభుత్వం సాగు భూమికే అందిస్తామని పేర్కొంటోంది. ప్రభుత్వం సాగు భూమికే భరోసా కల్పిస్తామనడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు రియల్ వ్యాపారులు సాగు భూములను యథేచ్ఛగా ఫాం ల్యాండ్స్ మార్చగా వీటికి భరోసా అందుతుందా లేదా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫాంల్యాండ్ పేరుతో జిల్లాలో ఏర్పాటైన వేలాది ఎకరాల భూములకు రైతు భరోసా కట్ చేయాలనే డిమాండ్ ఉంది. వాస్తవంగా రంగారెడ్డి జిల్లాలో 15లక్షల ఎకరాల భూమి ఉండగా అందులో 4 లక్షల సాగవడం గమనార్హం.
సాగుకు యోగ్యమైన భూమి ఉంటే చాలా
గత ప్రభుత్వం సాగు భూమినే కాదు.. భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు బంధు పథకం అమలు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూమికే రైతు బంధు అంటూ ప్రచారం చేస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలకు పెద్ద తేడా ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇచ్చి ఆరోపణలు లేకుండా చేతులు దులుపుకుంది. ప్రస్తుత ప్రభుత్వం నిజమైన రైతులకే రైతు భరోసా పథకం కల్పిస్తామనే ప్రచారంతో ఆరోపణలు ఎదుర్కోంటుంది. ఎందుకంటే జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములన్ని ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు, అగ్రవర్గాల ప్రజల చేతుల్లోనే ఉన్నాయనే చర్చ నడుస్తుంది. భూమి లేని నిరుపేదలకు కొండలు, గుట్టలున్న భూములను గత ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. దీంతో నిజమైన పేదవాడికి అన్యాయం జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. వాస్తవంగా సాగు చేసుకునే రైతుకే భరోసా కల్పిస్తే అనుమానాలన్నింటికి చెక్ పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొండలు, గుట్టల భూములకు భరోసా కల్పించొద్దని అనుకుంటుంది. కానీ సాగుకు యోగ్యమైన భూముల్లో ఫాం ల్యాండ్లకు భరోసా కల్పించాలా వద్దా అనే అంశం సీరియస్గా తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి పేరుతో వ్యాపారం చేసే వాళ్లకు భరోసా కల్పించొద్దనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తుంది.
జిల్లాలో 4లక్షలకు పైగా ఎకరాల్లో సాగు...
రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 15లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో 5లక్షల ఎకరాలు వ్యవసాయేతర భూములు రికార్డు ప్రకారం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖాధికారులు ప్రతి ఏడాది సాగు చేసే సర్వేలో వర్షాకాలంలో 4లక్షలు, యాసంగిలో 1లక్ష50వేల ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే సుమారుగా 25శాతం భూముల్లోనే సాగు జరుగుతుంది. కానీ రెవెన్యూ అధికారులు చేసిన కొన్ని తప్పిదాల వల్ల సాగుకు యోగ్యమైన భూములను ఫాం ల్యాండ్స్ చేశారు. ఆ భూములు వ్యవసాయ సాగు భూములుగానే అధికారులు గుర్తిస్తారా... రియల్ వ్యాపారులు చేసే దందాగా పరిగణిస్తారా అనే చర్చ జిల్లాలో విస్తృతంగా నడుస్తోంది. అధికారులు నిజమైన రైతులకు, సాగు భూములను పరిగణలోకి తీసుకుంటే 4లక్షల ఎకరాలకే రైతు భరోసా పథకం వర్తిస్తుందని సమాచారం.
– చేవెళ్ల మండలంలోని ఆలూర్, కిష్టాపూర్ రెవెన్యూ పరిధిలో ఎన్‌ఆర్‌ఐ పేరుతో ఫాంల్యాండ్ చేశారు.
–చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ఏడెకరాల్లో లోటస్ పేరుతో ఫాం ల్యాండ్
– చేవెళ్ల మండలం ఆలూర్ రెవెన్యూ పరిధిలో విచ్చలవిడిగా ఫాం ల్యాండ్స్ చేశారు. ఇందులో ఎస్ఎన్, ఏఎంహెచ్, లక్కీ, ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్1,2,3లో బోర్డులు లేకుండా ఫామ్ల్యాండ్
– మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామం సర్వే నెంబర్ 267లో 21 ఎకరాల్లో ఎన్‌ఆర్‌ఐ పేరుతో ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేశారు. గజాల్లో నగదు తీసుకుని గుంటల్లో భూమిని రిజిస్ట్రేషన్లు చేశారు.
– కందుకూరు మండలం నేదునూరు, బాచుపల్లి, పెరుగూడ గ్రామాల రెవెన్యూ పరిధిలో తులిప్ ఫాం పేరుతో ఏర్పాటు చేశారు.
– కందుకూర్ మండలం దన్నారం గ్రామంలో పొలం పేరుతో ఫాం ల్యాండ్ నిర్వహించారు.






