రెడీ ఫర్ ఇండస్ట్రీ..! ఉన్నత విద్యారంగంలో మార్పులకు శ్రీకారం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 01:34:09  IST  )

ఉన్నత విద్యారంగంలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతున్నది.

రెడీ ఫర్ ఇండస్ట్రీ..! ఉన్నత విద్యారంగంలో మార్పులకు శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యారంగంలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతున్నది. విద్యార్థుల నమోదును పెంచడంతోపాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి సరికొత్త అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా మారిటైమ్, ఏవియేషన్, డిఫెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో డిగ్రీ కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కళాశాలలు ఇటువంటి కోర్సులను అందించడం లేదు. ప్రభుత్వ సంస్థల ద్వారా వీటిని అందుబాటులోకి తెచ్చి విద్యార్థులను ‘ఇండస్ట్రీ రెడీ’గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని మండలి వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లతో నిర్వహించిన సమావేశాల్లో ఈ విద్యా సంస్కరణలపై సమగ్రంగా చర్చించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెల్లడించారు. విద్యార్థులు కొన్ని కోర్సుల పట్ల ఆసక్తి చూపకపోవడానికి గల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ఈ ఫ్యూచరిస్టిక్ కోర్సులను తీసుకువస్తున్నట్లు వివరించారు.

తెలంగాణ రైజింగ్‌లో భాగంగా..

కాలం చెల్లిన పాత కోర్సులతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారని సీఎం పదే పదే విద్యాశాఖ సమావేశాల్లో చెబుతున్నారు. తెలంగాణ రైజింగ్ లో భాగంగా ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంతేకాకుండా డిసెంబర్ 26 నుండి 28 వరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని సమావేశం నిర్వహించారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. దీంతో కొత్తకోర్సుల ప్రక్రియలో విద్యాశాఖ అధికారులు వేగం పెంచారు. ఉన్నత విద్యా మండలి ఎప్పటి నుంచో కొత్త కోర్సులు తీసుకురావాలని చెబుతున్నప్పటికీ.. కొందరు వీసీ, ఉన్నతాధికారులు లైట్ తీసుకున్నారు. కానీ రానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎలాగైనా విద్యార్థులకు అకడమిక్ ఇయర్ ప్రారంభంలోపు కొత్త కోర్సులు సిద్దం చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో ఇదే విషయంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వారం రోజుల క్రితం సమావేశాలు నిర్వహించి చర్చించారు.

అప్‌డేట్ కాకుంటే అవుట్‌డేటెడ్‌గానే మిగిలిపోతాం

నేటి కాలంలో అప్‌డేట్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. లేదంటే కాలగర్భంలో కలిసిపోతాం. విద్యా రంగంలో కొత్త కోర్సులు, సిలబస్ మార్పులు చాలా కీలకం. ఇప్పటికే ఐటీఐలను అడ్వాన్స్‌ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక రీడింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేశాం. కొత్త కోర్సుల రూపకల్పనలో పరిశ్రమల నిపుణులను భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. - ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్

Next Story