జపాన్ తో ద్వైపాక్షిక సంబంధాలకు రెడీ.. మంత్రి శ్రీధర్ బాబు

by Ramesh Goud |

జపాన్ లోని అయిచి రాష్ట్రంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

జపాన్ తో ద్వైపాక్షిక సంబంధాలకు రెడీ..  మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జపాన్ లోని అయిచి రాష్ట్రంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన అయిచి రాష్ట్ర ప్రతినిధులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. అయిచి రాష్ట్రం టొయోటా కార్ల పరిశ్రమతో పాటు, ఏరోస్పేస్, రోబోటిక్స్, ఆటోమొబైల్ యంత్ర పరికరాల తయారీలో అగ్రగామిగా ఉందన్నారు. ఇటీవలే ఆ రాష్ట్రం ‘ స్టేషన్ ఏఐ ’ పేరుతో జపాన్ లోనే అతిపెద్ద అంకుర సంస్థల ఇన్ క్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని టీ హబ్ కూడా అంకుర సంస్థల ప్రోత్సాహంలో దేశంలో ప్రముఖంగా నిలుస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు.

కాగా, అయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు, ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన హిరోహిటో కొండో ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో 2026 లో జరిగే 20 వ ఏషియా క్రీడలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. అక్కడి గిబ్లి యానిమేషన్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు ప్రాంతాలు ప్రయోజనం పొందేలా సహకారం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఇండోబాక్స్ ఇండియా ఎండీ డైసుకే టాంజీ, షిన్యా సుకాడా, నాచారంలోని సపల ఆర్గానిక్స్ సిఇఓ పైడి ఎల్లారెడ్డి, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డా. వి. నర్సింహాచార్యులు, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీ ఐఐసీ ఎండీ డా. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story