రేషన్ పరేషాన్.. డీలర్లకు గుబులు, మాఫియాకు పండగ!

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న మూడు నెలల రేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయి. పైకి 50 కిలోల బస్తా కనిపిస్తున్నా.. తూకం మాత్రం తేడాగా ఉంటోంది.

రేషన్ పరేషాన్.. డీలర్లకు గుబులు, మాఫియాకు పండగ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేసవి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించిన రేషన్​బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది. ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పన మొత్తం 18 కిలోలను అందజేస్తున్నది. సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బియ్యం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. డీలర్లు సైతం రోజంతా దుకాణాల్లో ఉంటూ బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో గోదాముల నుంచి వచ్చే బియ్యం బస్తాలో దోపిడీ జరుగుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాకు 4 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా క్వింటాల్‌కు 8 కిలోలను తాము నష్టపోవాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు. ఒక్కో సంచిలో బస్తా బరువుతో 50 కిలోలు ఉండాలి. ప్రస్తుతం సరఫరా అవుతున్న బస్తాలు 46 కిలోల వరకే ఉంటోంది. గోదాముల వద్ద వే బ్రిడ్జిలు ఉన్నా నిర్వహణ అధికారులు తొందరపాటుగా వ్యవహరిస్తూ తూకం వేయకుండా ఒక బస్తా 50 కిలోలు ఉంటుందని పరిగణిస్తూ లారీలో లోడ్​చేయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాలోని డీలర్లు ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర డీలర్​సంఘం నేతలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా రేషన్​దుకాణాలు ఉండటంతో వీటి ద్వారా ప్రభుత్వం 1.05 కోట్ల కార్డులలోని 3.20 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఆయా కుటుంబాల్లోని సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10, అంత్యో దయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున బియ్యం సరఫరా జరుగుతోంది.

ప్రైవేటు మిల్లర్లకు చేరవేత..

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టి చివరకు మిల్లర్ల వద్దకే చేరుతున్నాయి. త్వరలో యాసంగి సీజన్‌కు చెందిన ధాన్యం సీఎంఆర్​చేసేందుకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తోంది. వాటిని మర ఆడించిన తరువాత తిరిగి ఆ శాఖకు అప్పగించాలి. ప్రభుత్వానికి అప్పగించే బియ్యం స్థానంలో పీడీఎస్​రైస్​అందజేసేందుకు వారు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సీజన్‌కు​చెందిన సన్నబియ్యం నిల్వ చేసుకుని 4 నెలల తరువాత సీఎంఆర్​చేసి ప్రైవేటుగా కేజీకి రూ.60కు అమ్మకాలు చేస్తున్నారు. పీడీఎస్​రైస్‌ను​రూ.15 కే కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వడంతో కిలోకు రూ.45 వరకు సంపాదిస్తు్న్నారు. రేషన్​బియ్యం పక్కదారి బాగోతంలో ప్రభుత్వ అధికారులే ఉండటంలో వారిని కనిపెట్టి పట్టుకోవడం పౌరసరఫరాల శాఖ సిబ్బందికి సాధ్యం కావడం లేదు. ఒకవేళ కనిపెట్టినా మౌనంగానే ఉంటున్నట్టు తెలుస్తోంది.

పంపిణీతో నష్టాలు : డీలర్లు

గోదాముల్లో బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో వాటిని ఖాళీ చేసేందుకు 3 నెలల రైస్​ఒకేసారి పంపిణీ జరిగేలా తీసుకున్న నిర్ణయం తమకు నష్టాలు కలిగిస్తుందని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్​బియ్యానికి 8 కిలోలు తక్కువ రావడంతో లబ్ధిదారులకు ఏ విధంగా సర్దుబాటు చేయాలో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు బియ్యం నిల్వల కోసం అదనపు గదులు అద్దెకు తీసుకోవడం, రోజంతా పంపిణీ చేయాల్సి వస్తుండటంతో ఒక గుమాస్తాను నియమించుకోవాల్సి వస్తుందని, అతనికి నెలకు రూ. 15 వేలు వేతనం ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ప్రతినెలా బియ్యం పంపిణీ చేసేటప్పుడు ఇచ్చే కమీషన్​కంటే రెండింతలు ఈ సమయంలోఇవ్వాలని డీలర్లు డిమాండ్​చేస్తున్నారు.

మా దృష్టికి వస్తే చర్యలు చేపడతాం : పౌరసరఫరాల శాఖ

‘రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు మా దృష్టికి ఇంతవరకూ రాలేదు. ఒకవేళ వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం. బియ్యం పంపిణీలో మోసం జరుగుతోందని లబ్ధిదారులు గుర్తిస్తే మాకు సమాచారం అందించాలి. వెంటనే తగు చర్యలు తీసుకుంటాం’.

Next Story