కమీషన్ అందక రేషన్ డీలర్ల గగ్గోలు.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.115 కోట్లు పెండింగ్

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తూ ప్రశంసలు పొందితే రేషన్​డీలర్లు మాత్రం తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కమీషన్ అందక రేషన్ డీలర్ల గగ్గోలు.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.115 కోట్లు పెండింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తూ ప్రశంసలు పొందితే రేషన్​డీలర్లు మాత్రం తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కాగా అప్పటి నుంచి కమీషన్ లేదని, గతం కంటే స్టాక్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఒక రూమ్ అద్దెకు తీసుకుని పంపిణీ చేయగా, సన్నబియ్యం నుంచి రెండు గదులు అద్దెకు తీసుకుంటున్నారు. బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో రావడంతో రోజంతా సమయం కేటాయించడంతో పాటు ఒక సహాయకుడిని నియమించుకోవాల్సి వస్తోంది. అతనికి దినసరి కూలితో పాటు అదనంగా గది తీసుకోవడంతో ఖర్చులు గతం కంటే రెండింతలు పెరిగాయని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 5 నెలలకు సంబంధించిన కమీషన్ పెండింగ్​ఉందని, ఒక్కొక్క డీలర్‌కు సుమారుగా రూ.60 వేల నుంచి రూ.90 వేలు రావాల్సి ఉందని చెబుతున్నారు. నెలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.23 కోట్లు చెల్లించాలని, ఈ లెక్కన ఇప్పటివరకు రేషన్ డీలర్లకు రూ.115 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్​తీసుకునే వారి సంఖ్య పెరగడంతో ప్రభుత్వం కమీషన్​కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దొడ్డు బియ్యం ఇచ్చే కాలంలో రోజుకు ఒక పూట సమయం కేటాయిస్తే 10 రోజుల్లో పంపిణీ పూర్తయ్యేది. సన్నబియ్యం ప్రారంభమైన నాటి నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలు దుకాణాల వద్ద ఉండాల్సి వస్తోందని డీలర్లు వెల్లడించారు.

కమీషన్​పెంచాలని డిమాండ్

దొడ్డు బియ్యం సమయంలో తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు బియ్యం తీసుకునే వారు. సన్నబియ్యం ప్రారంభమైన తర్వాత దాదాపు 90 శాతం లబ్ధిదారులు రైస్ తీసుకుంటున్నారు. దీంతో నెలవారీగా పంపిణీ చేసే కోటా పెరుగుతోంది. సన్నబియ్యం పంపిణీ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా 89.95 లక్షల కార్డులకు బియ్యం పంపిణీ జరిగేది. సెప్టెంబర్​నుంచి కార్డుల సంఖ్య 97 లక్షలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు నెలకు 1.71 లక్షల మెట్రిక్ టన్నుల రైస్​పంపిణీ చేయగా, సెప్టెంబర్​నుంచి 2.10 లక్షల మెట్రిక్​టన్నులకు చేరుకుంటుంది. దీంతో రేషన్​డీలర్లపై భారం పడుతుంది. ఈ సమస్యలపై ఆలోచించిన డీలర్లు ఆగస్టులో ఖచ్చితంగా పెండింగ్​కమీషన్ చెల్లించాలని డిమాండ్​చేస్తున్నారు. కార్డుల పెంపు, బియ్యం కోటా పెరగడంతో తమకు కమీషన్​పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.140 ఇస్తుండగా, ఇక నుంచి రూ.250 వరకు ఇవ్వాలని.. లేకుంటే తాము డీలర్ల వృత్తి నిర్వహించలేమని బాహాటంగా చెబుతున్నారు.

నిర్లక్ష్యం చేస్తే..

ఐదు నెలల కమీషన్ ఆగస్టు నెలలో విడుదల చేస్తే ఆర్థిక సమస్యల నుంచి గట్టేకుతామని డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి అద్దెలు, సహాయకుల వేతనాలు చెల్లించామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధుల కొరత పేరుతో నిర్లక్ష్యం చేస్తే సెప్టెంబర్​కోటా పంపిణీపై పునరాలోచన చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. సర్కార్​రేషన్​పంపిణీపై ఎలాంటి గైడ్​లైన్స్​తీసుకొచ్చినా వాటిని పాటిస్తూ లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా అందజేస్తున్నామని, అయినా ప్రభుత్వం తమకు నెలవారీగా చెల్లించే కమీషన్​విషయంలో జాప్యం చేయడం తగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story