Goreti Venkanna: తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం

by Ramesh Naini |

తెలంగాణ గడ్డ నుంచి వచ్చి, తన సాహిత్యంతో, పాటలతో కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రఖ్యాత కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం దక్కింది.

Goreti Venkanna: తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గడ్డ నుంచి వచ్చి, తన సాహిత్యంతో, పాటలతో కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రఖ్యాత కవి, గాయకుడు, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సాహితీ సేవను గుర్తించిన డా. బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar University) గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ గౌరవ డాక్టరేట్‌ను గోరేటి వెంకన్నకు ప్రదానం చేయనున్నారు. ఇది తెలంగాణా సంస్కృతిని, ప్రజా జీవనాన్ని తన పాటల్లో ప్రతిబింబించిన ఒక గొప్ప సాంస్కృతిక సేనానికి దక్కిన అత్యున్నత గౌరవంగా భావించవచ్చు.

గోరటి వెంకన్న కృషి, సాహిత్య సేవ..

గోరటి వెంకన్న పాటలు కేవలం వినోదాన్ని పంచేవి కావు, అవి తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతిని, సామాజిక సమస్యలను, కష్టాలను, ఆశలను అద్దం పట్టిన జీవన గానాలు. గ్రామీణ వాతావరణం, మట్టి వాసన, వ్యవసాయం, పేదరికం వంటి అంశాలను ఆయన తన పాటల్లో ఆత్మీయంగా పలకరించారు. ఆయన పాటల్లోని పదాలు అత్యంత సరళంగా ఉంటూనే, లోతైన భావాన్ని కలిగి ఉంటాయి. ఆయన రచించిన 'కొండమీది చంద్రవంక', 'పూసిన పున్నమి' వంటి పాటలు, 'రేల పూతలు', 'ఎలుగు జిలుగు' వంటి కవితా సంకలనాలు ఆయన సాహితీ ప్రతిభకు నిదర్శనం. సినీ గీత రచయితగా ఆయన అందించిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణా సాంస్కృతిక వైభవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆయనకు లభించిన ఈ గౌరవ డాక్టరేట్, గోరటి వెంకన్నకు మాత్రమే కాక, తెలంగాణా ప్రజా జీవితాన్ని, సంస్కృతిని సజీవంగా ఉంచుతున్న కళాకారులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంట చక్రపాణి గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Next Story