అధికారుల పర్యవేక్షణ శూన్యం.. ఆగని ఖనిజ దోపిడీ!

by Kodari Anjali |

పాషాపూర్ రామ్ సింగ్ తండాలో యథేచ్ఛగా ఎర్రరాయి అక్రమ రవాణా నడుస్తుంది.

అధికారుల పర్యవేక్షణ శూన్యం.. ఆగని ఖనిజ దోపిడీ!
X

దిశ, పెద్దేముల్: మండలంలోని పాషాపూర్ రామ్ సింగ్ తండాలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రభుత్వ భూముల్లోని ఖనిజ సంపదను కొల్లగొడుతూ, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ సరిహద్దులు దాటించి కర్ణాటకకు ఎర్రరాయిని తరలిస్తున్నారు. స్థానిక అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రామ్ సింగ్ తండాలోని ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ 44 తో పాటు పాలు సర్వేనంబర్ లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

కథనం వస్తేనే కదులుతారా?

గత నెల ఏప్రిల్ 27న 'దిశ' పత్రికలో "మాఫియా మాయ.. గుట్టలు మాయం" అనే శీర్షికతో వెలువడిన కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. దీనిపై స్పందించిన మైన్స్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు ఏప్రిల్ 28న క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అక్రమ తవ్వకాలను పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.

మూడు రోజుల ముచ్చటేనా?

అధికారులు పర్యటించి ముచ్చటగా మూడు రోజులు కూడా గడవకముందే, అక్రమార్కులు మళ్ళీ తమ పని ప్రారంభించారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాత్రి పగలు తేడాలేకుండా ఎర్రరాయిని తరలిస్తున్న వైనంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యటన కేవలం కంటితుడుపు చర్యేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు.

ప్రభుత్వ ఖజానాను కాపాడాలి

ఖనిజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.

Next Story