సీఎం సభలో అస్వస్థతకు గురై కాంగ్రెస్ యువ నాయకుడు మృతి

by Kodari Anjali |

కాంగ్రెస్ యువ నాయకుడు శంకర్ మృతితో తలకొండపల్లిలో విషాదం నెలకొంది.

సీఎం సభలో అస్వస్థతకు గురై కాంగ్రెస్ యువ నాయకుడు మృతి
X

దిశ, తలకొండపల్లి: మండలంలోని గట్టు ఇప్పలపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ చురుకైన కార్యకర్త, యువ నాయకుడు ఏదుల శంకర్(శ్రీకాంత్)మృతి చెందడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గతంలో ఎస్సీ సెల్ విభాగంలో కీలకమైన పదవులు నిర్వహించిన శంకర్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ, ఉజ్వల రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్న సమయంలో ఆయన మృతి చెందడం అందరినీ కలచివేసింది. గత నాలుగు రోజుల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరైన శంకర్, సభలో కూర్చున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుర్చీపై నుంచి కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న నాయకులు, అధికారులు మహబూబ్నగర్ లోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీమ్స్ ఆసుపత్రికి తరలించారు. నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ ఆరోగ్య పరిస్థితిని సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వయంగా వెళ్లి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక, ఈరోజు మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో శంకర్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కుటుంబ సభ్యులకు తీరని లోటు..

ఒక్కసారిగా సీఎం సభలో కింద పడిపోయిన సమయంలో శంకర్ (శ్రీకాంత్) కోమాలోకి వెళ్లిపోవడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదనీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శంకర్ ప్రాణాలతో తిరిగి రావాలని గ్రామస్తులు మండలంలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వెంటనే శంకర్ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కొంతమంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా 1000 రూపాయలు, 2000 అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎంతమంది దాతలు ఆర్థిక సాయం అందించిన భగవంతుడు మాత్రం శంకర్ ప్రాణాలను కాపాడలేకపోయారని ఆవేదన గురవుతున్నారు. శంకర్ అందరినీ ఆప్యాయంగా "అన్న" అని పిలుస్తూ, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని గ్రామంలోని తన స్నేహితులు, నాయకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే శంకర్ వంటి యువ నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. శంకర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Next Story