- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీ హుజూర్! అక్రమార్కులకు మున్సిపల్ కమిషనర్ వత్తాసు
అక్రమ నిర్మాణదారులకు నార్సింగి మున్సిపల్ కమిషనర్.. సిబ్బంది వత్తాసు లుకుతూ అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, గండిపేట: అక్రమ నిర్మాణదారులకు నార్సింగి మున్సిపల్ కమిషనర్.. సిబ్బంది వత్తాసు లుకుతూ అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నార్సింగి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసి సర్కిల్‌గా అప్ గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్నా మొన్నటి వరకు మున్సిపల్ పరిధిలో వందలాది కన్వెన్షన్లు, అక్రమంగా షెడ్లు ఎన్నో వెలిశాయి. ఇదంతా మున్సిపల్ అధికారుల కనుసన్నల్లోనే జరిగింది. కర్త, కర్మ, క్రియ.. అన్నీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డినే వ్యవహరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఒక్కో నిర్మాణం నుంచి లక్షల్లో వసూలు..
నార్సింగి మున్సిపల్ పరిధిలోని చాలా ప్రాంతం 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ నిబంధనల ప్రకారం షెడ్లు, కన్వెన్షన్లు ఇతర నిర్మాణాలు ఏమాత్రం చేపట్టవద్దు. కానీ నిబంధనలకు పాతర వేసిన కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది వసూళ్ల పర్వానికి తెర లేపారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది ఆయన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి భారీగా వసూలు చేసి ఆయనకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విధంగా ఉన్నతాధికారి కోట్ల రూపాయలు గడించినట్లు తెలుస్తుంది. నార్సింగి మునిసిపల్ పరిధిలోని జనవాడ, మీర్జాగూడ, వట్టినాగులపల్లి తదితర ప్రాంతాల్లో వందలాది సంఖ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్డగోలుగా ఫంక్షన్ హాల్స్ వెలిశాయి. ఒక్కో కన్వెన్షన్ సెంటర్ నుంచి రూ.10 లక్షలకు పైగానే వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినట్లు విమర్శలున్నాయి. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారిణి ఇద్దరూ కుమ్మక్కై భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వాటాల పంపిణీ విషయంలో తేడాలు రావడంతోనే ఆమెను ఏసీబీ వలలో వేసినట్లు ఇక్కడి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రభుత్వానికి ఫిర్యాదు..
జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని, 111 జీవోకు అధికారులు అటకెక్కించి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని కొన్ని రోజుల క్రితం ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. అక్రమాలను క్షేత్ర స్థాయిలో చూస్తూ కూడా ఉపేక్షించిన మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయినా నార్సింగి మున్సిపాలిటీ అధికారులకు చీమకుట్టినట్లు కూడా కాలేదు. అక్రమ నిర్మాణాలపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా అక్రమార్కులను ప్రోత్సహించడంతో భారీ స్థాయిలో కన్వెన్షన్‌లో షెడ్లు వెలిశాయి. ఈ వ్యవహారం అంతా సీడీఎంఏ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనుక యంత్రాంగం తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నార్సింగి మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించి అందుకు ప్రోత్సహించిన కమిషనర్‌తో పాటు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






