డీలర్లపై చర్యలు ఉంటాయా?

by Thanuru Gopichand |

రేషన్‌ డీలర్ల సంఘం నేతలు కొందరు అధికారుల పేరు చెప్పుకుని డీలర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

డీలర్లపై చర్యలు ఉంటాయా?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రేషన్‌ డీలర్ల సంఘం నేతలు కొందరు అధికారుల పేరు చెప్పుకుని డీలర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల రేషన్‌ కమీషన్‌ పేరుతో బెదిరించి మరీ చేసిన వసూళ్లే ఇందుకు నిదర్శనం. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం బయటకు వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి పది రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు వసూళ్లు చేసిన డీలర్లపై గానీ.. సంఘం నేతలపై గానీ..ఎలాంటి చర్యలూ లేవు. దీంతో ఏం చేసిన బే ఫికర్‌ అన్నట్లుగా వసూల్‌ రాజాలు వ్యవహరిస్తున్నారు. వసూళ్ల విషయాన్ని ఎవరు లీక్‌ చేశారంటూ బెదిరింపులకు సైతం పూనుకుంటున్నారు. ఇలాగైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ ఎలా? పడుతుందని అధికారుల తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలేమిటన్న దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.

లీక్‌ చేసిన వారిపై సంఘం నేతల గుర్రు..

కేంద్రం నుంచి రేషన్‌ బియ్యానికి సంబంధించి కమీషన్‌ కోసమని రేషన్‌ డీలర్లకు సంబంధించిన ఓ సంఘం నేతలు డీలర్ల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేశారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌ ఛాటింగ్‌ కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్, వాయిస్ రికార్డింగులు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇది వివాదాస్పదం కావడంతో రంగంలోకి దిగిన సదరు సంఘం నేతలు అడిషనల్‌ కలెక్టర్‌ కు ఓ వినతి పత్రం అందజేశారు. సంక్షేమ నిధి కోసమే డబ్బులు వసూలు చేశామని, అధికారులకు ఇవ్వలేదని అందులో స్పష్టం చేశారు. దీంతో కమీషన్‌ కోసం డబ్బులు వసూలు చేసింది ఎవరన్నది స్పష్టత వచ్చింది. అలాగే ఏ క్యూర్‌ కోడ్‌ కు డబ్బులు వెళ్లాయన్నది కూడా వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్స్​ వల్ల అందిరికీ తెలిసిపోయింది. దీంతో సంఘం నేతలు తప్పు చేయలేదు అనడానికి ఆస్కారమే లేకుండా పోయింది. కానీ.. జిల్లా అధికారులు మాత్రం రేషన్‌ డీలర్లపైగానీ, సంఘం నేతలపై గానీ చర్యలు తీసుకోకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతా తేటతెల్లం అయ్యాక కూడా మీన మేషాలు లెక్కించడం ఎందుకో? అన్న చర్చ సంబంధిత వర్గాల్లోనే జరుగుతోంది. ఇదిలా ఉండగా.. అక్రమ వసూళ్లకు పాల్పడిన నేతలు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు. వసూళ్ల విషయాన్ని లీక్‌ చేసిన వారిపై గుర్రుగా ఉన్న సదరు వసూల్‌ రాజాలు బెదిరింపులకు పూనుకుంటున్నారు. ‘ఇదే గ్రూపులో కొందరు గుంట నక్కలు ఉన్నారని..వారెవరో మాకు తెలిసి పోయిందని, వారంతట వారు గ్రూపులో నుంచి రిమూవ్‌ కావాలని’ హెచ్చరించినట్లుగా ఉన్న ఓ వాట్సాప్‌ చాటింగ్‌ కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడిన డీలర్లపై, సంఘం నేతలపై చర్యలు తీసుకుని, మున్ముందు ఈ తరహా అక్రమాలు జరగకుండా చెక్‌ పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Next Story