- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రానా అయితే ఏంటి..! కూల్చివేసినా తిరిగి అక్రమ నిర్మాణాలు
అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేసినా వారు ఏమాత్రం లెక్కచేయడం లేదు.

దిశ, గండిపేట: అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేసినా వారు ఏమాత్రం లెక్కచేయడం లేదు. తమ ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నచందంగా వారి తీరు సాగుతోంది.
హై టెన్షన్ వైర్ల కింద కూల్చివేతలు..
మణికొండ సర్కిల్ పరిధిలోని పంచపాటి కాలనీ సమీపంలో ఉర్వి బై అర్బన్ స్కై నిర్మాణ సుమారు ఎకరం స్థలానికి పైగా నిర్మాణాలు చేపడుతోంది. అలాగే అక్కడే ఉన్న హై టెన్షన్ వైర్ల కింద కూడా గతంలో నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో పలువురు కొన్ని రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదులు చేయడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని నిర్మాణ సంస్థకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. హై టెన్షన్ వైర్ల కింద ఏర్పాటు చేసిన రేకుల షెడ్లతోపాటు ఇతర నిర్మాణాలను కూడా జేసీబీల సాయంతో అధికారులు నేలమట్టం చేశారు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. డోంట్ కేర్ అంటూ అడ్డగోలుగా ముందుకు సాగుతోంది.
పెడచెవిన పెట్టిన నిర్మాణ సంస్థ
నిబంధనలకు విరుద్ధంగా హై టెన్షన్ వైర్ల కింద ఏర్పాటు చేసిన నిర్మాణాలను కొద్ది రోజుల క్రితం హైడ్రా అధికారులు కూల్చివేయగా తిరిగి అక్కడే నిర్మాణాలు చేపడుతున్నారు. తాము ఎవరినీ లెక్క చేయము అనే విధంగా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. హైడ్రా అధికారులు కూల్చివేసిన తర్వాత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవలసిన స్థానిక మణికొండ మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. దీనిని అలుసుగా తీసుకున్న సదరు నిర్మాణ సంస్థ నిర్వాహకులు రెచ్చిపోయారు. తమకు పెద్ద స్థాయిలో ప్రజా ప్రతినిధులు తెలుసని, తమ వద్దకు ఎవరూ రారని ధీమాతో ఉన్నారు. ఇప్పటికైనా హైడ్రా అధికారులతో పాటు స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి.. నిబంధనలు ఉల్లంఘించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






