ఇబ్రహీంపట్నం అభివృద్ధికి రూ.3 వేల కోట్లు తెచ్చాం : మల్‌రెడ్డి

by Taduka Kalyani |

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్‌లోని తార కన్వెన్షన్ హాల్‌లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం అభివృద్ధికి రూ.3 వేల కోట్లు తెచ్చాం : మల్‌రెడ్డి
X

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్‌లోని తార కన్వెన్షన్ హాల్‌లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు రూ.3 వేల కోట్లు తీసుకొచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గత 15 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తుర్కయంజాల్ జోన్‌కు చెందిన 153 మంది, పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన 140 మంది, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన 107 మంది లబ్ధిదారులతో కలిపి మొత్తం 400 మందికి రూ.4.46 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వ పాలనలో జరిగిన దుర్వినియోగమే కారణమని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మధ్య సమతుల్యత పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. గతంలో మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండేవారు కాదని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న పార్టీకే భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story