పర్మీషన్ లేకుండా వందల ఎకరాల్లో వెంచర్.. ‘సంపద నెక్ట్స్ జెన్’ సంస్థ ఒంటెద్దు పోకడ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-02 02:41:07  IST  )

అనుమతులు రాకముందే వెంచర్‌ పనులు చేయడం.. ప్రశ్నించిన వారికి రాజకీయ నాయకులు, పెద్దల పేర్లు చెప్పి దబాయించడం.. ఇదీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో ‘సంపద నెక్ట్స్ జెన్’ రియల్ ఎస్టేట్ సంస్థ తీరు.

పర్మీషన్ లేకుండా వందల ఎకరాల్లో వెంచర్.. ‘సంపద నెక్ట్స్ జెన్’ సంస్థ ఒంటెద్దు పోకడ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/షాద్‌‌నగర్‌: అనుమతులు రాకముందే వెంచర్‌ పనులు చేయడం.. ప్రశ్నించిన వారికి రాజకీయ నాయకులు, పెద్దల పేర్లు చెప్పి దబాయించడం.. ఇదీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో ‘సంపద నెక్ట్స్ జెన్’ రియల్ ఎస్టేట్ సంస్థ తీరు. నిబంధనలకు విరుద్ధంగా, పర్మిషన్స్ లేకుండా వందల ఎకరాల్లో వెంచర్ వేసిన ఈ సంస్థ.. అధికారుల నోటీసులు సైతం సైతం బేఖాతరు చేస్తున్నది. పర్మిషన్స్ చూపెట్టమంటే.. అప్లయ్ చేసిన పేపర్స్ చూపించి వితండవాదం చేస్తున్నది. ఆఖరికి ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. వెంచర్ లో ఏర్పాటు చేసిన జెండాలను గురువారం తొలగించినట్లు సమాచారం.

ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి..

కొందుర్గు మండల కేంద్రంలోని లూర్డునగర్‌ నుంచి ఉమ్మెత్యాల్‌ వెళ్లే రహదారిలో 23/ఎ4, 247ఇ, 26/ఎ, 24ఎ3, 24ఎ సర్వే నంబర్లలో ‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ సంస్థ అనుమతులు లేకుండా సుమారు వంద ఎకరాల్లో భారీ వెంచర్‌ ను ఏర్పాటు చేస్తున్నది. వెంచర్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించింది. రోడ్ల పనులు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే.. ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్పుకుని అధికారులతోపాటు వార్తలు రాస్తున్న జర్నలిస్టులను సైతం సంస్థ నిర్వాహకులు దబాయిస్తున్నారు.. ‘అప్లయ్‌ చేశాం.. అనుమతులు వస్తాయి’ అని వితండవాదం చేస్తున్నారు. ఇచ్చిన నోటీసులను లెక్క చేయకపోవడంతో ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంప్లయింట్ ను ఎఫ్‌ఐఆర్‌ చేయకుండా సంస్థ తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అయితే కస్టమర్లు ప్లాట్లు కొన్నాక.. ఏమైనా ఇబ్బందులు ఎదురై ప్రశ్నిస్తే.. వారిపై కూడా యాజమాన్యం ఇదేరీతిన దౌర్జన్యానికి దిగుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

జనవరి 3 డెడ్‌లైన్..

నోటీసులను పట్టించుకోకపోవడంతో అక్రమ వెంచర్ పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యాజమాన్యం రంగంలోకి దిగింది. పలువురు అధికారులను కలిసి ‘మాకు పలుకుబడి ఉంది’ అని చెప్పినట్లు తెలిసింది. అయితే అనుమతులకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని గట్టిగా అడగడంతో.. కొన్ని పత్రాలు తెచ్చి చూపించారు. అయితే అవన్నీ వెంచర్‌ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన పత్రాలుగా గుర్తించారు. ఈ నెల 3 వరకు పర్మిషన్స్ కు సంబంధించి అన్ని పత్రాలు ఇస్తామని రియల్‌ సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో అప్పటి వరకు పనులు నిలిపివేయడంతోపాటు వెంచర్‌ లో ఏర్పాటు చేసిన జెండాలను తొలగించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో యాజమాన్యం గురువారం జెండాలను తొలగించినట్లు తెలిసింది. ఇప్పటికే వెంచర్‌ లోపల 60 ఫీట్ల ప్రధాన రహదారితో పాటు 30 ఫీట్లు, 40 ఫీట్ల అంతర్గత రహదారులను నిర్మించి సైడ్‌ వాల్స్‍ సైతం నిర్మించారు. ఈనెల 3 తర్వాత అనుమతి పత్రాలు ఇవ్వని పక్షంలో వెంచర్‌ లోని అన్ని నిర్మాణాలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర..

‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ అక్రమంపై మండల స్థాయిలో ఎంపీఓ విజయ్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి సురేఖలు నిక్కచ్చిగా వ్యవహరించారు. యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలకు తొలగించేందుకు భద్రత కల్పించాలంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ.. జిల్లా స్థాయి అధికారులు మాత్రం చొరవ చూపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పైస్థాయి అధికారుల నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతోనే కింది స్థాయి అధికారులు ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులు మౌనం వహించడంతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పై కూడా కదలిక లేకుండా పోయినట్లు సమాచారం. అధికారులు ఇచ్చిన నోటీసును తీసుకునేందుకు ‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ యాజమాన్యం ససేమిరా అన్నది. హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు ఉన్నాయని ఓ తప్పుడు రిజిస్ట్రేషన్‌ నంబర్ సైతం ఇచ్చి అధికారులనే తప్పుదోవ పట్టించింది. హెచ్‌ఎండీఏ కు దరఖాస్తు చేసిన విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా దబాయించినట్లు తెలిసింది. అధికారులపై ఇలా దురుసుగా ప్రవర్తిస్తే కూడా జిల్లా అధికారుల నుంచి ఎటువంటి చలనం లేకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న కింది స్థాయి అధికారులకు భరోసా నిచ్చేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

పర్మిషన్స్ వచ్చే వరకు పనులు చేయొద్దని చెప్పాం

కొందుర్గు మండల కేంద్రంలో డెవలప్ చేస్తున్న ‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ వెంచర్‌ నిర్వాహకులు కొన్ని పత్రాలను ఇచ్చారు. అయితే అవన్నీ దరఖాస్తుకు సంబంధించిన పత్రాలు. పూర్తి అనుమతులకు సంబంధించినవి కావు. దీంతో అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులు కొనసాగించవద్దని నిర్వాహకులకు స్పష్టంగా చెప్పాం. - సురేఖ, పంచాయతీ కార్యదర్శి

అనుమతులు చూపకపోతే నిర్మాణాలు కూల్చేస్తాం

‘సంపద నెక్ట్స్‌ జెన్‌’ వెంచర్‌ కు ఎలాంటి అనుమతులు లేవు. సంబంధిత సైట్‌ లో చెక్‌ చేయగా అనుమతులు ఉన్నట్లు చూపడం లేదు. హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశామని, మీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈనెల 3 వరకు అనుమతులకు సంబంధించి అన్ని పత్రాలు సమర్పిస్తామని చెప్పారు. గడువులోపు పత్రాలు సమర్పించకుంటే.. బందోబస్తుతో వెళ్లి వెంచర్‌ లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. - విజయ్‌ కుమార్‌, ఎంపీఓ

Next Story