వెంచర్‌ అక్రమాలపై వార్తలు.. ‘దిశ’ రిపోర్టర్‌ కు బెదిరింపులు

by Malleboina Mahesh |

షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గులో ఓ వెంచర్‌ పై ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనాలతో ఓ సర్పంచుకు కోపం వచ్చింది. అక్రమ వెంచర్‌ అని అధికారులు నిర్ధారించిన విషయాన్నే ‘దిశ’ పత్రిక రాసింది.

వెంచర్‌ అక్రమాలపై వార్తలు.. ‘దిశ’ రిపోర్టర్‌ కు బెదిరింపులు
X

దిశ, షాద్‌ నగర్‌ : షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గులో ఓ వెంచర్‌ పై ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనాలతో ఓ సర్పంచుకు కోపం వచ్చింది. అక్రమ వెంచర్‌ అని అధికారులు నిర్ధారించిన విషయాన్నే ‘దిశ’ పత్రిక రాసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు వెంచర్‌‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం కూల్చివేశారు. అధికారులు చేసిన ఈ పనికి.. అందరి నుంచి సానుకూల స్పందన రాగా..ఆ సర్పంచిలో మాత్రం ఆవేదన కన్పించింది. అంతే కాదు..ప్రభుత్వ అధికారికి సంబంధించిన ఫోన్‌ నుంచే ‘దిశ’ రిపోర్టర్‌‌తో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. గ్రామాభివృద్ధికి పాటు పడాల్సిన పాలకవర్గం అక్రమాలకు కొమ్ము కాస్తున్నదా! అన్న చర్చ ప్రస్తుతం షాద్‌ నగర్‌ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది.

అసలేం జరిగిందంటే..

కొందుర్గు మండల కేంద్రంలో ఓ వెంచర్‌ కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై ‘దిశ’ పత్రికలో కథనాలు వచ్చాయి. వెంచర్‌ నిర్వాహకులపై ఎలాంటి చర్యలకూ పూనుకోకుండా ఓ ప్రజా ప్రతినిధి రంగంలోకి దిగారు. ఇదే విషయం వార్తలో ప్రచురితమైంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేను కాదంటూ భుజాలు తడుముకున్నట్టు కొందుర్గు సర్పంచ్‌ డాపురం ప్రభాకర్‌, ఉప సర్పంచ్‌ చంద్రశేఖర్‌‌లు వార్డు సభ్యులతో కలిసి సోమవారం కొందుర్గు పంచాయతీ కార్యదర్శి సురేఖ ఫోన్‌ నుంచి ‘దిశ’ రిపోర్టర్‌ కు ఫోన్‌ చేసి ఆవేశంగా మాట్లాడారు. ‘కొందుర్గు మండలంతో నీకేం పని. నీవు ఎక్కడి రిపోర్టర్‌ వు. అసలు నీకు సమాచారం ఇచ్చిన వారి పేరు చెప్పాల్సిందే... లేదంటే నిన్ను ఎక్కడికి పిలిపించాలో పిలిపిస్తాం.., ఎక్కడ నిల్చో బెట్టాలో అక్కడే నిల్చో పెడతాం...’’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఉన్నదే రాశామని, తప్పుగా రాయలేదని రిపోర్టర్‌ సమాధానం ఇచ్చినప్పటికీ సర్పంచు ఊరుకోలేదు. మరింత ఆవేశంగా మాట్లాడుతూ.. 14 మంది వార్డు సభ్యులతో కలిసి నీ సంగతి తేలుస్తానంటూ సర్పంచ్‌ ప్రభాకర్‌ ఫోను పెట్టేశారు.

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తీరుపై సర్వత్రా చర్చ..

కొందుర్గు సర్పంచ్‌ డాపురం ప్రభాకర్‌, ఉపసర్పంచ్‌ చిప్ప చంద్రశేఖర్‌, వార్డు సభ్యుల తీరుపై షాద్‌ నగర్‌ నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వెంచర్‌ పై అధికారులు చర్యలు తీసుకుంటే ప్రశంసించాల్సింది పోయి..‘దిశ’ రిపోర్టర్‌ పై కొందుర్గు గ్రామ పంచాయతీ పాలకవర్గం బెదిరింపులకు పాల్పడమేమిటని పలువురు పాలకవర్గం తీరును తప్పుబడుతున్నారు. ఏకంగా ఓ ప్రభుత్వ అధికారి ఫోన్‌ నుంచి మాట్లాడి బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామ సంపదను, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించాల్సిన ప్రథమ పౌరుడే ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరైంది కాదని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కొందుర్గు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ విన్పిస్తోంది.

తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా..

కొందుర్గు పాలకవర్గ సభ్యులు నాకు ఫోన్‌ చేసి నాలుగు రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. దిశ రిపోర్టర్‌ కు సమాచారం ఎవరిచ్చారు? అంటూ ప్రతినిత్యం ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారు. సోమవారం నా ఫోన్‌ నుంచి దిశ రిపోర్టర్‌ కు ఫోన్‌ చేయించారు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ లు ఇద్దరూ ఫోన్‌ లోనే బెదిరించడం వల్ల మరింత క్షోభకు గురవ్వాల్సి వచ్చింది. - పంచాయతీ కార్యదర్శి సురేఖ

Next Story