RTI పత్రాలతో బట్టబయలైన ‘వేరుశనగ’ మాయాజాలం

by Ratna Kumari |

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NMEO-OS (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ సీడ్స్) పథకాన్ని దౌల్తాబాద్ మండల అధికారులు అక్రమార్జనకు దారిగా మార్చుకున్నారు.

RTI పత్రాలతో బట్టబయలైన ‘వేరుశనగ’ మాయాజాలం
X

దిశ‌, కొడంగ‌ల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NMEO-OS (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ సీడ్స్) పథకాన్ని దౌల్తాబాద్ మండల అధికారులు అక్రమార్జనకు దారిగా మార్చుకున్నారు. వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి అధికారులు సమర్పించిన అధికారిక రికార్డులకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి అస్సలు పొంతన లేదు. RTI ద్వారా బయటపడ్డ వివరాల ప్రకారం.. ఈ కుంభకోణం కేవలం వసూళ్లకే పరిమితం కాలేదని, నిధుల మళ్లింపు కోసం భారీగా రికార్డులను ఫోర్జరీ చేశారని స్పష్టమవుతోంది.

పథకాల పేరుతో ‘డబుల్’ గేమ్!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వ్యవసాయ రంగంలో VCC (వాల్యూ చైన్ క్లస్టర్) అనేది రైతుల ఆదాయాన్ని పెంచడానికి రూపొందించబడిన ఒక సమగ్ర వ్యవస్థ. లో భాగంగా 100% వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ జరగాలి. రికార్డుల ప్రకారం గోకఫసల్వాడ్, తిమ్మారెడ్డిపల్లిలో 373 మంది రైతులకు 506 క్వింటాళ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు నివేదికలు ఇచ్చారు. వాస్తవానికి రైతుల వద్ద ‘ధర’ కట్టి నగదు వసూలు చేశారు. ఒక్క రైతుకు కూడా రశీదు ఇవ్వకపోవడం గమనార్హం. BLD ( బ్లాక్ లెవల్ డెమాన్‌స్ట్రేషన్) ఒక నిర్ణీత విస్తీర్ణంలో వేరుశనగ పంటను సాగు చేసే రైతులకు 50% రాయితీపై పథకం కింద సగం ధరకే ఈర్లపల్లి, గోకఫసల్వాడ్, చల్లాపూర్, దౌల్తాబాద్ గ్రామాల్లోని 240 మంది రైతులకు 337 క్వింటాళ్ల విత్తనాలను ఈ పథకం కింద పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ​ఇక్కడ కూడా ఒక్క క్వింటాల్ ఇచ్చిన రైతులకు రెండు క్వింటాళ్లు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి గారడీ చేశారు. ఈ అదనపు కోటాను నల్లబజారుకు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.

వలస వెళ్ళిన వారినీ వదలలేదు!

అధికారుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందంటే.. బతుకుదెరువు కోసం వలస వెళ్ళిన రైతుల పేర్లను కూడా వదలకుండా వాడేశారు..? రైతులకు తెలియకుండానే వారి పేర్లపై 100% సబ్సిడీ పొందినట్లు రికార్డులు సృష్టించినట్లు RTI ద్వారా వెల్లడవుతోంది. వేరుశనగ తీసుకోని వారు, దరఖాస్తు చేయని వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.

'నాకు తెలియకుండానే లిస్టులో పేరు ఎలా వచ్చింది'? : బాధిత రైతు కిష్ట్యానాయక్

"నేను అసలు వేరుశనగ గురించి దరఖాస్తు చేసుకోలేదు, తీసుకోలేదు. కానీ అధికారుల జాబితాలో నా పేరు మీద ఎవరో తీసుకున్నట్లు చూపిస్తున్నారు. వీరికి సమాధానం చెప్పే వారెవరు?

ఒకటి ఇస్తే రెండు" అని రాశారు.

క్రిమినల్ కేసులు పెట్టాలి : విజయ్ బాబు, గోకఫసల్వాడ్

"నేను అధికారుల దగ్గర ఒక క్వింటాల్ తీసుకున్నాను. కానీ RTI పత్రాల్లో మాత్రం నా పేరు మీద రెండు క్వింటాళ్లు తీసుకున్నట్లు నమోదు చేశారు. ఇలాంటి తప్పుడు లెక్కలతో నిధులు స్వాహా చేస్తున్న అధికారులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి" అని పేర్కొన్నారు.

గతంలోనూ అదే తీరు.. పరిగి, కొడంగల్‌లో విచారణ ‘కరువు

గతంలో పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో వేరుశనగ విత్తన పంపిణీ అక్రమాలపై పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చినా, విచారణ మాత్రం కాగితాలకే పరిమితమైంది. ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసినా, ఉన్నతాధికారులు ఉత్తుత్తి విచారణలతో అక్రమార్కులను కాపాడారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు దౌల్తాబాద్‌లోనూ అదే పంథాలో విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story