లీడర్ కోసం.. తాండూరు కాంగ్రెస్‌లో ఎదురుచూపులు

by Disha Web Desk 9 |
లీడర్ కోసం.. తాండూరు కాంగ్రెస్‌లో ఎదురుచూపులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఏ పార్టీలోనైనా క్యాడర్​ను మోసం చేసే నేతలున్నారు తప్ప లీడర్‌ను మోసం చేసిన క్యాడర్ లేదని సుస్పష్టం. ఇదే పరిస్థితి వికారాబాద్​ జిల్లా తాండూర్​ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. నాయకులు అవకాశాల కోసం పార్టీలు మారేందుకు పాచికలు వేసుకుంటారు. ఎందుకంటే వ్యాపారుల కోసం, ఆర్థిక లావాదేవీల సంబంధాలు, తప్పుడు వ్యాపారులు చేసే నాయకులకు అధికార పార్టీ అండదండలు అవసరముంటాయి.

అందులో భాగంగానే గెలిపించిన ప్రజలను మోసం చేసి పార్టీలు మారుతున్న సంఘటనలూ ఉన్నాయి. అందులో భాగంగానే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించారు. దీంతో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలను సమన్వయం చేస్తూ గెలుపునకు పని చేసే స్థాయి లీడర్​ లేకపోవడంతో క్యాడర్​ కన్ఫ్యాజన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎంగా ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ తాండూర్​ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9 దఫాలుగా కాంగ్రెస్, 3 దఫాలుగా టీడీపీ, ఒక దఫా బీఆర్​ఎస్​ గెలిచింది. సీఎంగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి 4 సార్లు ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. అంతేకాకుండా టీడీపీగానీ, బీఆర్​ఎస్​ గానీ గెలిచినప్పుడు ప్రత్యర్థి పార్టీగా కాంగ్రెస్​ పార్టీ 13 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. పార్టీలో పదవులు ఆశించిన నాయకులు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారినట్లు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ‌మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి లాంటి అనుభవం లేని నాయకుడి చేతిలో ఓడిపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇదే మహేందర్​ రెడ్డి 2004, 2009, 2014లో గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిపైన తక్కువ ఓట్లతో గెలుపొందారు. అంటే ఇక్కడ కాంగ్రెస్​ పార్టీకి ప్రభావితం చేసే నాయకుడు, ప్రజా సమస్యలపై ప్రశ్నించి పరిష్కారించే నాయకుడు వస్తే క్యాడర్​ మరింత పటిష్టమైతుంది. ఈ నియోజకవర్గంపై అధిష్టానం దృష్టి పెట్టడం లేదనే వాధన వినిపిస్తుంది.

పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న నేత..

కేడర్‌ను కాపాడుకునేందుకు మాజీ మంత్రి మణిక్​ రావు తనయుడు పీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్​ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయాలతో రమేశ్ పోటీ పడే శక్తి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం చెదిరిపోకుండా ఉండేందుకు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ప్రజల్లో ఉంటున్నారు.

ఆర్థికంగా బలవంతులైన పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ ఎవరో ఒకరు ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో చేరిక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పైలెట్ రోహిత్ తిరిగి పార్టీలోకి వచ్చినా ప్రాధాన్యత ఇవ్వరనే ప్రచారం లేకపోలేదు. అదే పట్నం మహేందర్ రెడ్డి వస్తే కాంగ్రెస్​ బరిలో ఉండే అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతుంది.

బలమైన కేడర్‌కు అండదండ ఎవరు..?

తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా ఎవరు అనేది బాగా చర్చ సాగుతుంది. పట్నం మహేందర్ రెడ్డి బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరుతారనే ప్రచారం సాగుతుంది. కానీ ఆయన పార్టీ మారే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. బలమైన క్యాడర్​ను తాండూర్​ నియోజకవర్గంలో నాయకుడు లేకపోవడంతో ప్రశ్నర్థకంగా మారిపోయింది. ఏ కొత్త నాయకుడు కాంగ్రెస్​ పార్టీ నుంచి టికెట్​ దక్కించుకొని బరిలో ఉంటే గెలుపునకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Also Read: ఆ ఇద్దరు ఎవరు? రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల్లో టెన్షన్!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed