- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్‌లో గలాట..రిసార్ట్‌లో మాటల యుద్ధం
శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సీట్ కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ నెలకొంది. దీంతో ఇరువురి ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకులు రెండుగా చీలిపోయారు. చైర్మన్ పీఠం కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు.

చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్‌లో గలాట
షామీర్‌పేట్ లియోనియో రిసార్ట్‌లో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే మాటల యుద్ధం
నా నియోజకవర్గంలో నీదేం పెత్తనం?
చేవెళ్ల నాది.. నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు?
జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు ఎదుటే వాగ్వాదం
సర్ది చెప్పిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు
దిశ, శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. చైర్మన్ పీఠం కోసం సాత ప్రవీణ్ కుమార్‌తో పాటు దండు రాజేశ్వర్ పేరు కూడా తెరమీదకి వచ్చినట్టు తెలుస్తుంది. శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సీట్ కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ నెలకొంది. దీంతో ఇరువురి ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకులు రెండుగా చీలిపోయారు. చైర్మన్ పీఠం కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని లియోనియో రిసార్ట్ వేదికగా శంకర్‌పల్లి చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించిన విషయం తెలిసింది.
ఆదివారం లియోనియో రిసార్ట్‌లో చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సాత ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటించగా, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి 12వ వార్డు నుంచి గెలుపొందిన దండు రాజేశ్వర్ పేరును తెరమీదకు తెచ్చారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి బీమ్ భరత్ సమక్షంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. నా నియోజకవర్గంలో నీదేం పెత్తనం అంటూ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ప్రశ్నించగా.. చేవెళ్ల నాది నీవేంది అడగడానికి అంటూ మంత్రి శ్రీధర్ బాబు ఎదుటే ఘాటుగా స్పందించారని టాక్ వినబడుతుంది.
ఎమ్మెల్యే వర్గీయులైన ఇద్దరు నాయకులను ఉద్దేశించి సొంత పార్టీ అభ్యర్థులను ఓడించిన మీరు నన్నా ప్రశ్నించేది అంటూ మహేందర్ రెడ్డి మండిపడ్డారని తెలిసింది. దీంతో చివరకు మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని సోమవారం జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షీల్డ్ కవర్లో పేర్లు పంపుతుందని, షీల్డ్ కవర్లో ఎవరి పేరు సూచిస్తే వారికి మద్దతు తెలుపుతూ కౌన్సిలర్లు అందరూ చేతులెత్తాలని స్పష్టం చేశారు. అయితే గెలుపొందిన మెజార్టీ కౌన్సిలర్లు మాత్రం చైర్మన్ ఎన్నిక విషయంలో సాత ప్రవీణ్ కుమార్‌కే మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. కాగా షీల్డ్ కవర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల పేరు ఎవరిది ఉంటుందో వేచి చూడాల్సిందే.






