- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరిగిపోతున్న మట్టిగుట్టలు.. మాఫియా డాన్‌కు అధికారపార్టీ అండదండలు
అధికారపార్టీకి చెందిన నేతల అండదండలు చూసుకుని ఓ వ్యక్తి రెచ్చిపోతున్నాడు. ఇష్టానికి మట్టిగుట్టలు తవ్వుకుంటూ ప్రభుత్వ ఖజానాకే భారీ గండి కొడుతున్నాడు.

దిశ, షాద్ నగర్ : అతనో మట్టి మాఫియా డాన్..మట్టి దందా చేయడంలో తనకు సాటి లేరని పెట్రేగి పోతున్నాడు. ప్రభుత్వ భూములే అతని టార్గెట్. మట్టి దోచుకుంటే తానే దోచుకోవాలి. కాదని మరెవరైనా దోచుకుంటే దగ్గరుండి మరీ అధికారులకు పట్టిస్తాడు. పగలు సామాజిక వేత్తగా.. రాత్రి అయితే మాఫియా అవతారంలో చేస్తున్న మట్టి దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఒకప్పుడు సామాన్యుడిలా ఉన్న అతను..నేడు రూ.కోట్లకు పడగతలెత్తడానికి మట్టి మాఫియానే కారణమన్న టాక్ అందరి నోటా విన్పిస్తోంది. అడ్డుగా ఎవరైనా.. వస్తే బడా నేతల పేర్లు చెప్పుకుంటూ నిర్విఘ్నంగా దందా సాగిస్తుండడంతో అధికార పార్టీకి సైతం అప్రతిష్టగా మారుతోంది. అక్రమ దందాను ఆపే దమ్ముందా! అన్నట్లుగా అతను అందరికీ సవాల్ విసురుతున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలో జరుగుతున్న అతని ఆగడాలకు అధికారులు చెక్ పెట్టలేక పోతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
అక్రమ దందాకు అందరి అండ!..
ఫరూఖ్ నగర్ మండలంలో మట్టి మాఫియా డాన్ గా చెలరేగిపోతూ ప్రభుత్వ ఖజానాకి భారీ గండి కొడుతున్నాడు ఓ ఘనుడు . ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను, ప్రైవేటు వ్యవసాయ పొలాలను గుల్ల చేస్తూ జేబులను నింపుకుంటున్నాడు. తాను చేస్తున్న వ్యాపారం వైపు అధికారుల్వెరూ కన్నెత్తి చూడకూడదన్న ఉద్దేశ్యంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే..ఆ పార్టీ చెంతకు చేరుతాడన్న విమర్శలూ ఉన్నాయి. పార్టీలు మారడమంటే అతనికి బట్టలను మార్చినంత తేలిక అని స్థానికంగా అందరూ చెప్పుకుంటారు. దందా గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ గ్రామ అభివృద్ధికి సహకరిస్తా..అంటూ గ్రామ పెద్దలను సైతం బుట్టలో వేసుకుంటాడన్న టాక్ కూడా ఉంది. మాట వినకుంటే..బెదిరించడం..లేదంటే నయానో, భయానో ఇచ్చి దందాకు అడ్డులేకుండా చేసుకుంటాడని ఇక్కడి ప్రజానీకం చెప్పుకుంటోంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల పేర్లు చెప్పి దందా సాగిస్తుండడంతో అక్రమ దందా వారి కనుసన్నల్లోనే నడుస్తుందా! అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు వస్తే.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏదైనా తప్పని పరిస్థితుల్లో దందా సాగిస్తున్న వాహనాలకు అధికారులు జరిమానాలు విధించినా డోంట్ కేర్..అన్నట్లుగా అతని వ్యవహార శైలి ఉంటోందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి ‘గండి’..
మట్టి తవ్వకాలను జరపాలంటే మైన్స్, రెవిన్యూ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. హద్దులు నిర్ణయించిన ప్రాంతంలోనే మైనింగ్ నిర్వహించాలి. కానీ..ఈ నిబంధనలేవీ సదరు మట్టి బకాసురుడికి వర్తించవు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా.. ఏ రకమైన రాయల్టీ కట్టకుండా యథేచ్చగా తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ‘అధికారం మాదే.. అడ్డుకునే వారెవరు?’ అన్నట్లు నిర్విరామంగా దందాను సాగిస్తుండడంతో పెద్ద పెద్ద కొండలు కరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అనుమతులు తీసుకుంటుండగా.. నిబంధనల మేరకు మట్టి తవ్వకాలు జరగడం లేదు. పరిధి దాటి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టిని తరలించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో మట్టిని తరలిస్తున్నారు. రహదారులపై దర్జాగా మట్టి వాహనాలు రయ్ రయ్ మంటూరు దూసుకుపోతున్నా.. అధికారుల కళ్లు తెరుచుకోవడం లేదు. రాత్రి వేళల్లో జరుగుతున్న మట్టి తరలింపుతో వాహనాల శబ్దానికి నిద్ర సైతం కరువవుతోందని స్థానిక ప్రజానీకం వాపోతున్నది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఫరూఖ్ నగర్ మండలంలో డాన్ మట్టి దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మట్టి మాఫియా డాన్ కు అండగా నిలుస్తున్నది ఎవరు?. ఇందులో ఎవరి పాత్ర ఎంత! అన్నది కూడా తేల్చాలని పలువురు కోరుతున్నారు.






