‘ఫ్యూచర్‌ సిటీ’కి కొత్త బాస్

by velandi.Saikiran |

భావి నగరం శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్‌ సిటీ’ నూతన పోలీసు కమిషనర్‌‌గా తరుణ్‌ జోషి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

‘ఫ్యూచర్‌ సిటీ’కి కొత్త బాస్
X

‘ఫ్యూచర్‌ సిటీ’కి కొత్త బాస్

-పోలీస్ కమిషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన తరుణ్‌ జోషి

-డాక్టర్‌ టూ ఐపీఎస్ గా వివిధ హోదాల్లో సేవలు

-హైదరాబాద్‌, వరంగల్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో తనదైన ముద్ర

-పర్వతారోహణ ఆయన హాబీ

-ప్రజల విశ్వాసాన్ని పొందేలా పారదర్శకంగా సేవలు- తరుణ్‌ జోషి

దిశ, రంగారెడ్డి బ్యూరో : భావి నగరం శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్‌ సిటీ’ నూతన పోలీసు కమిషనర్‌‌గా తరుణ్‌ జోషి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఫ్యూచర్‌ సిటీకి తొలి కమిషనర్‌ గా పని చేసిన జి.సుధీర్‌ బాబు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో తరుణ్‌ జోషిని ప్రభుత్వం నియమించింది. తుక్కుగూడలోని కమిషనరేట్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తరుణ్‌ జోషికి పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు.

స్వస్థలం పంజాబ్‌..

2004 ఐపీఎస్ బ్యాచ్‌ కు చెందిన తరుణ్‌ జోషి పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించారు. ఆయన పటియాలాలోని గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా పనిచేశారు. అనంతరం 2004లో సివిల్‌ సర్వీసెస్ కు ఎంపికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ కు చెందిన ఐపీఎస్ అధికారిగా నియామకమయ్యారు. తదుపరి 2014లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీస్ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో మాస్టర్స్​‍ పూర్తి చేసి, 2019లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 2014 నుంచి 2016 వరకు ఆదిలాబాద్‌ ఎస్పీగా పని చేసిన తరుణ్‌ జోషి, అనంతరం హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా, స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ సీపీగా సేవలందించారు. రాచకొండ, వరంగల్‌ పోలీస్ కమిషనర్‌ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఏసీబీ డైరెక్టర్‌ గా విధులు నిర్వహిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పోలీసు మేనేజ్‌ మెంట్‌ లో మాస్టర్స్​‍ పూర్తి చేశారు. అనంతరం ఎల్‌ఎల్‌బీ చదివి అదే విశ్వవిద్యాలయంలో టాప్‌ ర్యాంక్‌ సాధించారు.

పర్వతారోహణ ఆయన హాబీ..

ఓ పక్క పోలీస్ శాఖలో విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే..పర్వతారోహణపై ఆయనకు ఉన్న ఆసక్తితో ఆ రంగంలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2017లో హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో శిక్షణ తీసుకుని, అదే ఏడాది అక్టోబర్‌ లో మౌంట్‌ రీనాక్‌‌ను అధిరోహించారు. ఇప్పటి వరకు పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించారు. ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారోను సైతం అధిరోహించి శిఖరాగ్రంపై జాతీయ జెండాను రెపరెపలాడించారు.

పారదర్శకంగా సేవలు..

- తరుణ్‌ జోషి

ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పారదర్శకంగా సేవలు అందిస్తానని ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ తరుణ్‌ జోషి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది నియామకంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్​‍ నివారణ, సైబర్‌ నేరాల అదుపునకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామన్నారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

Next Story