ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు..

by velandi.Saikiran |   (  Updated:2025-12-01 01:05:55  IST  )

కడ్తాల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గ్రామాభివృద్ధి

ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు..
X

ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు..

- కడ్తాల్‌ మండలంలో రంగంలోకి గ్రామ పెద్దలు

- ఇప్పటికే గోవిందాయ‌పల్లి తండా సర్పంచ్ ఏకగ్రీవం

- మైసిగండిలోనూ కొనసాగుతున్న చర్చలు

దిశ, ఆమనగల్లు : పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఏ నలుగురూ ఒక్క దగ్గర కలిసినా.. ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ముగియగా.. రెండో విడత కోసం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెండో విడత కోసం కొన్ని గ్రామాల్లోని కొందరు ఆశావహులు తమ నామినేషన్ల కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. మరి కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు..

కడ్తాల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఏకమై సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పలు గ్రామ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ మహిళకు కేటాయించిన గోవిందాయపల్లి తండా సర్పంచ్ పదవి కోసం గ్రామ ప్రజలు ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో సబవట్ జాను రమేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానం చేశారు. అదే బాటలో జనరల్ రిజర్వేషన్ వచ్చిన మైసిగండి గ్రామం సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకుందామని రెండు రోజుల క్రితం పెద్దల సమక్షంలో చర్చలు జరిపారు. అయితే ఇంకా ఏ విషయమూ కొలిక్కి రాలేదు. ఇక్కడ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిపేందుకు గ్రామస్తులు మొగ్గు చూపుతున్నారు. కాగా.. కడ్తాల్ మండలంలో 24 గ్రామపంచాయతీలు ఉండగా మైసిగండి, గోవిందాయ పల్లి తండా గ్రామాలు మినహా.. మిగతా గ్రామాల్లో పోలింగ్ ద్వారానే సర్పంచుల ఎన్నిక జరగనుంది.

- గోవిందాయ పల్లి తండా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా చేసిన గ్రామ పెద్దలు

Next Story