విల్లాల కోసం ‘నాలా’ డైవర్షన్‌!

by velandi.Saikiran |

వరద ముప్పును నియంత్రించడంలో కీలకపాత్ర పోషించే ‘నాలా’ను పరిరక్షించాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు..

విల్లాల కోసం ‘నాలా’ డైవర్షన్‌!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: వరద ముప్పును నియంత్రించడంలో కీలకపాత్ర పోషించే ‘నాలా’ను పరిరక్షించాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు.. ఓ రియల్‌ ఎస్టేట్ సంస్థకు జీ హుజూర్ అన్నారు. ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి.. అడిగిందే తడవుగా ‘నాలా’ డైవర్షన్‌ కు పచ్చజెండా ఊపి.. ఎన్‌వోసీ జారీ చేశారు. అయితే నాలాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆ సంస్థ.. మాట తప్పింది. రాళ్లు, మట్టితో పూడ్చేసి నాలాను నామరూపాల్లేకుండా చేస్తున్నది. దీంతో ఇప్పుడు మేల్కొంటున్న అధికారులు.. వ్యర్థాలను తొలగించకుంటే అనుమతులను రద్దు చేయాలని లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం గౌరెల్లిలోని ‘లెగసీ ఏఎమ్మార్‌’ విల్లాల నిర్మాణంలో అక్రమాలు, అధికారుల సహకారం చర్చనీయాంశంగా మారింది.

కాసులకు కక్కుర్తి పడే ఆమోదమా?

సర్వే నంబర్ 213, 214, 215లను అనుసరించి ‘నాలా’ ఉంది. ఇదే ప్రాంతంలో ‘లెగసీ’ రియల్‌ సంస్థ విల్లాలను నిర్మిస్తున్నది. విల్లాల నిర్మాణాలకు ‘నాలా’ అడ్డుగా వస్తుండడంతో డైవర్షన్‌ కోసం సదరు సంస్థ నీటి పారుదల శాఖకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఎటువంటి ప్రజాప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా.. నీటిపారుదల శాఖ అధికారులు రెండేళ్ల క్రితం ఎన్‌వోసీ జారీ చేశారు. అప్పట్లో ఎస్ఈ, సీఈ స్థాయి అధికారుల క్షేత్రస్థాయి పర్యటన తర్వాతనే ఎన్‌వోసీని జారీ చేసినట్లు తెలిసింది. విల్లాల కోసం ఏకంగా ‘నాలా’ గొంతు నులిమిన నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడే అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

ప్రజాప్రయోజనాలను పట్టించుకోకుండా..

సాఫీగా సాగిపోయే నాలాను దారి మళ్లించాలంటే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. కాలనీలకు, రైతుల పొలాలకు ప్రమాదం పొంచి ఉన్న సందర్భాల్లోనే.. నాలా మళ్లింపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏదైనా అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంటే.. అందుకు అంగీకరించాలి. వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ‘నాలా’ మళ్లింపునకు ఆమోదం తెలపాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదీ..‘నాలా’ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను మార్చకుండా మళ్లించేలా డిజైన్‌ లో మార్పు చేయాలి. కానీ.. గౌరెల్లిలో ‘లెగసీ ఏఎమ్మార్‌’ రియల్‌ సంస్థ స్వప్రయోజనాల కోసం నాలా మళ్లింపునకు నీటి పారుదల శాఖ అధికారులు పచ్చజెండా ఊపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చెప్పింది ఒకటి.. చేస్తున్నది మరొకటి

ఎన్‌వోసీ జారీ సందర్భంగా ‘లెగసీ ఏఎమ్మార్‌’ రియల్‌ సంస్థ నీటి పారుదల శాఖకు ఇచ్చిన మాటను సైతం నిలబెట్టుకోలేకపోయింది. నాలా వెడల్పు 6 మీటర్లు కాగా.. 2 మీటర్ల మేర బఫర్‌ జోన్‌ ఉంటుంది. డైవర్షన్‌ ప్రాంతంలో నాలాను అభివృద్ధి పర్చి బాక్స్‍ డ్రైన్‌ ల నిర్మాణం చేపడతామని ‘లెగసీ ఏఎమ్మార్‌’ మాటిచ్చింది. నీటిపారుదల శాఖ రిపోర్టులో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నట్లు సంబంధిత అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ‘నాలా’ అభివృద్ధి మాటేమో కానీ.. ఉన్న ‘నాలా’కే రియల్‌ సంస్థ ఎసరు పెట్టింది. పెద్ద పెద్ద రాళ్లు, మట్టితో నాలాను పూడ్చింది. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన నీటి పారుదల శాఖ అధికారులు.. రియల్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలను తొలగించని పక్షంలో గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సిందిగా నీటిపారుదల శాఖ డీఈ కొద్దిరోజుల క్రితం ఈఈకి లేఖ రాశారు. దీంతో రియల్‌ సంస్థ కేవలం బండరాళ్లను మాత్రమే తొలగించి, చదును చేసి చేతులు దులుపుకున్నది. దీనివల్ల వరద నీరు పారే అవకాశం కూడా లేదు. మరి.. నేడో, రేపో క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో? అన్నది ఆసక్తికరంగా మారింది.

తెగిపోయిన ‘నాలా’ లింక్‌

‘లెగసీ ఏఎమ్మార్‌’ రియల్‌ సంస్థ ‘నాలా’ను కనుమరుగు చేయడంతో లింక్‌ తెగిపోయి వరద ప్రవాహానికి మధ్యలోనే అడ్డుకట్ట పడుతున్నది. భారీ వర్షాల సందర్భంలో ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం విల్లాల నిర్మాణ ప్రాంతం మార్గంలో దిగువకు ప్రవహించి ‘మాలోని’ కుంటలోకి వెళ్తుంది. అటు నుంచి చివరగా మూసీలో కలుస్తుంది. ‘నాలా’ లింక్‌ తెగిపోవడంతో ప్రస్తుతం వర్షాలు కురిసినప్పుడు విల్లాల ప్రాంతం తటాకాన్ని తలపిస్తున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే.. విల్లాలు కొనుగోలు చేసిన వారు నిండా మునిగే దుస్థితి ఏర్పడనున్నది. అలాగే లోతట్టు ప్రాంతాలకు సైతం వరద ముప్పు ఏర్పడనున్నది.

Next Story